- అర్ధరాత్రి తర్వాత ఏపీలో తీరం దాటే చాన్స్
- గంటకు 70 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
- సూర్యాపేట, పాలమూరు, వనపర్తికి ఆరెంజ్ అలర్ట్
- హైదరాబాద్లో రెండు రోజులు వానలు
హైదరాబాద్, వెలుగు: బంగాళాఖాతంలో కొనసాగుతున్న మురసు తుపాను తీవ్ర తుపానుగా బలపడింది. సోమవారం అర్ధరాత్రి తర్వాత ఇది ఏపీలోని నెల్లూరు–నర్సాపురం మధ్య, ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
దీని ప్రభావంతో తీర ప్రాంతాలతో పాటు తెలంగాణలోనూ విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కుండపోత వానలు పడే అవకాశం ఉందని తెలిపింది.
మంగళవారం నల్గొండ, నాగర్కర్నూల్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. సూర్యాపేట, మహబూబ్నగర్, వనపర్తి జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఈ ఐదు జిల్లాల్లో గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మిగతా చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది.
బుధవారం ఆరు జిల్లాల్లో భారీ వానలు
బుధవారం వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. గురు, శుక్రవారాల్లో (5, 6 తేదీలు) రాష్ట్రమంతటా మోస్తరు వర్షాలు పడతాయని, ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
