మేడిగడ్డను సందర్శించిన మహారాష్ట్ర సీఎస్ ..ప్రాజెక్టు వివరాలపై ఆరా

మేడిగడ్డను సందర్శించిన మహారాష్ట్ర సీఎస్ ..ప్రాజెక్టు వివరాలపై ఆరా

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీని సోమవారం మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేష్ అగర్వాల్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మహదేవపూర్ మండలంలోని బ్యారేజీని సందర్శించిన ఆయన ప్రాజెక్టు నిర్మాణం, నీటి లభ్యత, విద్యుత్ వినియోగం, టీఎంసీల నిల్వ సామర్థ్యం తదితర వివరాలను ఇరిగేషన్ ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నారు. 

మేడిగడ్డ ఈఈ సురేశ్​ కుమార్ ప్రాజెక్టు వివరాలను ఆయనకు వివరించారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరోంచ తాలూకా రైతులు గోదావరి బ్యాక్​వాటర్​తో ఎదుర్కొంటున్న సమస్యలను రాజేష్​అగర్వాల్​ దృష్టికి తీసుకెళ్లారు. రైతులతో మాట్లాడిన ఆయన వారి సమస్యలను తెలుసుకున్నారు. ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో తుమ్మడిహెట్టి ప్రాజెక్టుపై చర్చలు జరిపిన నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యతను సంతరించుకుంది. 

ఆలయంలో ప్రత్యేక పూజలు.. 

కాళేశ్వర ముక్తీర స్వామి ఆలయాన్ని సందర్శించిన రాజేష్​అగర్వాల్​ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో నదీ తీరంలో చేపడుతున్న పనుల పురోగతిపై ఆరా తీశారు. ఆయన వెంట గడ్చిరోలి జిల్లా కలెక్టర్ అవిశాంత్ పండా, మహారాష్ట్ర డీఐజీ యోగేశ్​కుమార్, ఎస్పీ రమేశ్, భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ తదితరులు ఉన్నారు.