రైల్వే బ్రిడ్జి కోసం ఘట్ కేసర్ బంద్...భారీ నిరసన ర్యాలీ

రైల్వే బ్రిడ్జి కోసం ఘట్ కేసర్ బంద్...భారీ నిరసన ర్యాలీ

ఘట్‌‌కేసర్‌‌,వెలుగు : రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం, మరోవైపు ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు నిరసనగా సోమవారం ఘట్‌‌కేసర్‌‌ పట్టణ బంద్‌‌ నిర్వహించారు. 17 ఏండ్లుగా రైల్వే బ్రిడ్జి కోసం ఎదురుచూస్తున్నా సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు, ప్రజలు, విద్యార్థులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. రైల్వే గేటు నుంచి భారీ ర్యాలీ తీశారు. 

బ్రిడ్జి నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్‌‌ చేశారు. బంద్‌‌కు వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు, చిరు వ్యాపారులు, ఆటో, ట్యాక్సీ కార్మికులు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు. చివరికి నిరసనకారులతో సీఐ కిరణ్ చర్చలు జరిపారు. ఉన్నతాధికారులు జనవరిలో పనులు మొదలుపెడతామని చెప్పడంతో వారికి సర్ది చెప్పి ఆందోళనను విరమింపజేశారు.