ముంబైను మరోసారి వార్తలు ముంచెత్తనున్నాయి. ఈ నెలాఖరులో అరేబియా సముద్రంలో ఏర్పడే తుఫాను కారణంగా ముంబైలో వర్షాలు దంచికొట్టనున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
రాబోయే 48 గంటల్లో ఆగ్రేయ, తూర్పు మధ్య అరేబియా సముద్రానికి ఆనుకుని అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వివరించింది. ఈ అల్పపీడనం అక్టోబర్ 21 నాటికి అరేబియా సముద్రం మీదుగా తుఫానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. మహారాష్ట్ర తీరం, దక్షిణ గుజరాత్ తీరంలో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించింది.
బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ మద్యలో తుఫానులు ఏర్పడుతుంటాయి. హిందూ మహాసముద్ర ప్రాంతంలో తుఫానులకు నామకరణం చేయడానికి అనుసరించిన సూత్రం ప్రకారం..భారత సముద్రాల్లో ఉష్ణమండల తుఫాను ఏర్పడినట్లయితే..దానిని తేజ్ అని పిలుస్తారు. దీంతో రాబోయే 48 గంటల్లో ఏర్పడే తుఫానుకు తేజ్ గా నామకరణం చేశారు. ప్రస్తుతం అరేబియా సముద్రంలో ఏర్పడే తేజ్ తుఫాను కారణంగా గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటక, కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.
