లాక్ డౌన్ కష్టాలు: ఉపాధి కోల్పోయిన అడ్డాకూలీలు

లాక్ డౌన్ కష్టాలు: ఉపాధి కోల్పోయిన అడ్డాకూలీలు

‘చేద్దామంటే పని లేదు.. ఇంట్లో సరుకులు, జేబులో పైసలు లేవు.. అయ్యోఅని ఆదుకునేటోళ్లు లేరు..’ అని అడ్డా కూలీలు ఆవేదన చెందున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని కూలీ కుటుంబాలపై లాక్ డౌన్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉమ్మడి జిల్లాలోని సంగారెడ్డి, మెదక్, సిద్ది పేటలో దాదాపు 3వేల మంది అడ్డా కూలీలు ఉన్నారు. లాక్ డౌన్ కారణంగా వీరంతా ఉపాధి కోల్పోయారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలను కొందరు దాతలు ఆదుకుంటున్నా.. పేదలుగా మగ్గిపోతున్న అడ్డా కూలీల పరిస్థి తి మాత్రం మారడం లేదు. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో రోజూ వారి కూలీ పనులతో వచ్చే కొద్ది పాటి సంపాదనతో కుటుంబాలు పోషించుకునే నిరుపేద కూలీల పరిస్థితి దయనీయంగా మారింది.

పడిగాపులు..

సంగారెడ్డి జిల్లాలో సుమారు1,250 మంది, మెదక్ జిల్లాలో 600 మంది, సిద్దిపేట జిల్లాలో 1,150 మంది కూలీలు ఉన్నారు. ఇందులో భవన నిర్మాణ రంగంతో పాటు పేయింటర్స్, కార్పెంటర్లు, ప్లంబింగ్‌‌‌‌‌‌‌‌ వంటి పనులతో పాటు మట్టి పనులు చేసే వారే ఎక్కువగా ఉన్నారు. వీరంతా సంగారెడ్డి, సదాశివపేట, పటాన్‌‌‌‌చెరు, నారాయణఖేడ్, జోగిపేట, జహీరాబాద్, మెదక్, తూప్రాన్, సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ తదితర ప్రధాన పట్టణాల కూడళ్ల వద్ద ఏర్పాటు చేసుకున్నఅడ్డాలకు పని కోసం ఆశతో వెళ్తున్నారు. అడ్డమీద కూర్చువేచి ఉంటున్న వారిని పోలీసులు వెళ్లడొడుతున్నారు.

లాక్ డౌన్ కష్టాలు

కరోనా ఎఫెక్ట్ తో  మొదట మార్చి 22న జనతా కర్ఫ్యూ నిర్వహించిన ప్రభుత్వం ఆ తర్వాత లాక్ డౌన్ విధించింది. ఫలితంగా కూలీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఒక వేళ వెళ్లినా వారికి పని ఇచ్చేటోళ్లు లేరు. భవన నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఉపాధి లేక ఇల్లు గడవడం కష్టం అవుతోందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ పరిస్థితి అర్థం చేసుకుని ఆదుకోవాలని వేడుకుంటున్నారు.