
- దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు కృష్ణ స్వరూప్ ఆరోపణ
- 29న చలో సెక్రటేరియట్‌కు పిలుపు
బషీర్ బాగ్, వెలుగు: ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు, సుప్రీంకోర్టు న్యాయవాది వడ్లమూరి కృష్ణ స్వరూప్ పిలుపునిచ్చారు. వర్గీకరణకు మద్దతు తెలిపిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తిరుగుబాటుకు సిద్ధం కావాలన్నారు. శుక్రవారం హిమాయత్‌నగర్‌లోని పార్టీ ఆఫీసులో మాలమహానాడు నేతలతో కలిసి కృష్ణ స్వరూప్మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధమన్నారు. జడ్జిలు ఆర్టికల్ 341 నిబంధనను ధిక్కరించారని, కేంద్రంలోని బీజేపీ, మోదీ ఇచ్చిన స్క్రిప్టును తీర్పుగా ఇచ్చారని ఆరోపించారు. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ కోసం అవసరమైతే ఆర్డినెన్స్ తెస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడాన్ని తప్పుబట్టారు.
సీఎం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. మాలల ఓట్లతో అధికారంలోకి వచ్చి, ఇప్పుడు వెన్నుపోటు పొడుస్తున్నారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఈ నెల 29న ‘చలో సెక్రటేరియట్’ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కాంగ్రెస్, బీజేపీ ప్రజాప్రతినిధుల ఇండ్లను ముట్టడించి పెద్ద ఎత్తున నిరసన చేపట్టాలని పిలుపునిచ్చారు. మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జె.ఎన్.రావు, జాతీయ ఉపాధ్యక్షుడు జొన్నలగడ్డ భాస్కర్, డీబీపీ నేతలు సిలివేరి వసంత్‌రావు, చిప్పర్తి సుబ్బారావు, బుంగ జయరాజు, బత్తుల సత్యనారాయణ, మహ్మద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.