
హైదరాబాద్, వెలుగు: హుజూరాబాద్ ఉప ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ దళిత బంధును ఆపేస్తారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్అన్నారు. ఏడేండ్లుగా దళితులను సీఎం కేసీఆర్ మోసం చేస్తూనే ఉన్నారని విమర్శించారు. హుజూరాబాద్ లో జరిగిన కార్యక్రమం ప్రభుత్వ సమావేశంలా లేదని, పార్టీ సమావేశంలా ఉందని మండిపడ్డారు. ఆ మీటింగ్‌లో పాడి కౌశిక్ రెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్‌లు ఎందుకున్నారని ఆయన ప్రశ్నించారు. మంగళవారం గాంధీ భవన్లో దాసోజు మీడియాతో మాట్లాడారు. ‘సీఎస్ సోమేశ్ కుమార్ చిల్లరగా వ్యవహరిస్తున్నారు. కలెక్టర్ కర్ణన్ కూడా పింక్ కలర్ హోర్డింగులు పెడుతున్నారు. కేసీఆర్ తాలిబన్ల మాదిరిగా ప్రభుత్వ వ్యవస్థలను విధ్వంసం చేస్తున్నారు. హుజూరాబాద్సభలో కేసీఆర్ నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్పి తన క్రెడిబిలిటీని పోగొట్టుకున్నారు. ఏడేండ్లలో ఒక్కసారి కూడా అంబేద్కర్‌విగ్రహానికి పూల దండ వేయని కేసీఆర్‌ను దళితులు నమ్మరు. నేరెళ్లలో దళితుల పట్ల ఎంత అమానుషంగా ప్రవర్తించారో అందరికీ తెలుసు. ఇన్నేండ్లలో మొదటిసారి సీఎంవోలోకి ఒక దళిత ఐఏఎస్ అడుగుపెడుతున్నారు. సబ్ ప్లాన్ కింద దళితులకు ఖర్చు చేయాల్సిన సొమ్మంతా వేరే పనులకు డైవర్ట్ చేశారు. బుధవారం జరిగే దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలో కేసీఆర్జిత్తులన్నీ ఎండగడతాం..’ అని దాసోజు చెప్పారు. దళితులకు మూడెకరాల భూపంపిణీని సీఎం కేసీఆర్ గాలికొదిలేశారని మాజీ ఎంపీ మల్లు రవి విమర్శించారు. చివరకు దళిత బంధుకు కూడా అదే గతి పట్టిస్తారన్నారు.