రెండేండ్లుగా కాగితాల్లోనే దళితబంధు.. ఒక్క పైసా రిలీజ్ చేయని కేసీఆర్

రెండేండ్లుగా కాగితాల్లోనే దళితబంధు.. ఒక్క పైసా రిలీజ్ చేయని కేసీఆర్

రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్​ చేసిన ఆరోపణల్లో వాస్తవాలు లేవని తేలిపోయింది. కేసీఆర్ ​చేసిన ఆరోపణల్లో ఒక్క నిజం కూడా లేదని, ఆ పథకాలన్నింటినీ బీఆర్ఎస్​ హయాంలోనే పెండింగ్​లో పెట్టినట్టు వెల్లడైంది. గత ప్రభుత్వం రెండేండ్లుగా దళితబంధు పథకాన్ని అమలు చేయడం లేదని.. బడ్జెట్లో నిధుల కేటాయింపులు తప్ప ఒక్క పైసా రిలీజ్​ చేయలేదని అధికారులు రిపోర్ట్​లో వెల్లడించారు. దాంతో దాదాపు రూ.35 వేల కోట్ల నిధులు కొలాప్స్​ అయినట్టు పేర్కొన్నారు. 

దళితబంధు స్కీమ్​ కింద  బీఆర్​ఎస్​ ప్రభుత్వం 2022–23లో 1500 మంది లబ్ధిదారులకు రూ.17,700 కోట్లు కేటాయించింది.  2023-–24   బడ్జెట్​లోనూ అంతే కేటాయింపులు చేశారు.  ఈ లెక్కన దళితబంధు స్కీంకు రెండేండ్లలో రూ.35 వేల కోట్లు.. దాదాపు మూడున్నర లక్షల మంది లబ్ధిదారులకు ఇవ్వాల్సి ఉండగా.. ఒక్కరికి కూడా ఇవ్వలేదని అధికారులు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరలకు సంబంధించి బకాయిలను కూడా తీర్చలేదు.  నవంబర్ 2023 వరకు సుమారుగా 488.38 కోట్లు వస్త్రాలకు సంబంధించి టెస్కోకు బకాయి పడింది. 

వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

కేసీఆర్​ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశించినట్టు తెలిసింది. ఆయా శాఖలవారీగా గత ప్రభుత్వం ఏమేమి స్కీంలు.. ఎంత ఆలస్యం చేసింది ? ఎన్ని నిధులు ఖర్చు చేసిందనే వివరాలతో బీఆర్ఎస్ అబద్దాలను తిప్పికొట్టాలని తెలిపారు. ఇష్యూస్​ డైవర్ట్​ చేయడానికి  కేసీఆర్​ఎంతటి అబద్ధాన్నైనా చాకచక్యంగా చెప్పగలుగుతారని.. ఈ విషయంలో కాంగ్రెస్​ క్యాడర్, ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పినట్టు తెలిసింది.