లబ్ధిదారుల లిస్టుల్లో సగానికిపైగా టీఆర్ఎస్ లీడర్లే

లబ్ధిదారుల లిస్టుల్లో సగానికిపైగా టీఆర్ఎస్ లీడర్లే
  •     పదవులు, కొలువులు, భూములు, కార్లు ఉన్నోళ్లకు చోటు
  •     చాలా మండలాల్లో ఊరికొక్కరికే..
  •     పైసలు ఎవరికొచ్చినా కుల సంఘాలకు ఇచ్చేలా తీర్మానాలు
  •     దళితబంధు ఇప్పిస్తామని కొన్నిచోట్ల దళారుల వసూళ్లు
  •     అనర్హులను ఎంపిక చేస్తున్నారంటూ రోడ్డెక్కుతున్న దళితులు


వెలుగు, నెట్‌‌వర్క్: దళితులను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన పథకం దళిత బంధు. కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరుగుతున్న మొదటి విడత దళిత బంధు ఎంపికలో సామాన్యులకు చోటు దక్కడం లేదు. నియోజకవర్గానికి 100 మందిని ఎంపిక చేస్తుండగా.. ఇప్పటిదాకా బయటికి వచ్చిన లిస్టుల్లో సగానికి పైగా టీఆర్ఎస్ లీడర్లు, వాళ్ల అనుచరుల పేర్లే కనిపిస్తున్నాయి. వాళ్లలోనూ చాలామంది పదవులు, సర్కారు ఉద్యోగాలు, భూములు, కార్లు, ఇతరత్రా ఆర్థికంగా ఉన్నోళ్లే కావడంతో సామాన్య దళితులు న్యాయం కోసం రోడ్డెక్కుతున్నారు. మరోవైపు చాలా మండలాల్లో ఊరికి ఒక్కరో, ఇద్దరో సామాన్యులకు చాన్స్ వస్తుండగా.. లబ్ధిదారుల పేర్లను కుల సంఘాలే ఎంపిక చేస్తున్నాయి. పైసలు వచ్చాక పంచుకునేలా తీర్మానాలు చేసుకుంటున్నాయి. ఏ నియోజకవర్గంలో చూసినా దళిత ఫ్యామిలీలు వేలల్లో ఉండడం, 100 మందిని మాత్రమే స్కీంకు ఎంపిక చేస్తుండడంతో తీవ్ర పోటీ నెలకొంది. ఇదే అదనుగా కొందరు దళారులు దళితబంధు ఇప్పిస్తామంటూ లక్ష నుంచి 2 లక్షల దాకా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

లీడర్ల అనుచరులు, బంధువులే లబ్ధిదారులు

ఈనెల 5 కల్లా లిస్టులు ఫైనల్ చేయాల్సి ఉన్నప్పటికీ చాలా నియోజకవర్గాల్లో ఇంకా సర్వే కొనసాగుతోంది. లిస్టులు ఫైనల్ అయిన చోట్ల సగానికి పైగా టీఆర్ఎస్​ లీడర్లు, వాళ్ల బంధువులు, అనుచరుల పేర్లే కనిపిస్తున్నాయి. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా వివిధ దశల్లో దళితులందరికీ దళితబంధు వర్తింపజేస్తామని చెప్పిన సీఎం.. ఫస్ట్​ప్రయారిటీ నిరుపేదలకేనని, ప్రభుత్వ ఉద్యోగులకు చివరి లిస్టుల్లో చాన్స్​ఇస్తామని పలుమార్లు స్పష్టం చేశారు. కానీ ఎమ్మెల్యేలు ఎంపిక చేస్తున్న లిస్టుల్లో పేదలు కనిపించడం లేదు. ఉదాహరణకు ఎస్సీ సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురి నియోజకవర్గంలో చెర్లపల్లెకు చెందిన జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ సిగిరి ఆనంద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ పడిదం నారాయణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పడిదం వెంకటేశ్, వెల్గటూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి జూపాక కుమార్, కిషన్​రావుపేట, పడకల్​గ్రామాల మాజీ సర్పంచులు తారల్ల చంద్రయ్య, మేకల రాజేశం.. ఇలా అందరూ టీఆర్ఎస్ లీడర్లు, వాళ్ల అనుచరులే ఉన్నారు. వీళ్లంతా ఆర్థికంగా అంతో ఇంతో ఉన్నవారే. రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌‌‌‌ 100 మంది లబ్ధిదారులతో రెడీ చేసిన లిస్టులో రామగుండం కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ పరిధిలోని 69 పేర్లున్నాయి. వీటిలో మాజీ మేయర్‌‌‌‌ కొంకటి లక్ష్మీనారాయణ భార్య, మరో మాజీ మేయర్‌‌‌‌‌‌‌‌ చిట్టూరి రాజమణి కొడుకు, 27వ డివిజన్‌‌‌‌‌‌‌‌ కార్పొరేటర్‌‌‌‌ ‌‌‌‌భర్త, 33వ డివిజన్‌‌‌‌ కార్పొరేటర్‌‌‌‌ ‌‌‌‌సోదరుడు, 35వ డివిజన్‌‌‌‌‌‌‌‌ కార్పొరేటర్‌‌‌‌‌‌‌‌ కొడుకు, 28వ డివిజన్‌‌‌‌‌‌‌‌ కార్పొరేటర్‌‌‌‌‌‌‌‌ ఇంజపురి పులేందర్‌‌‌‌‌‌‌‌ అన్న కొడుకు, 36వ డివిజన్‌‌‌‌‌‌‌‌లో ఎమ్మెల్యే అనుచరుడైన ఓ కాంట్రాక్టర్‌‌‌‌.. ఇలా లిస్టులో ఎమ్మెల్యే అనుచరులు, టీఆర్ఎస్​ లీడర్లు, అందులోనూ ఆర్థికంగా ఉన్నవాళ్లే కావడం గమనార్హం. దీంతో రామగుండంలో ఎమ్మెల్యే ఇచ్చిన లిస్టును పక్కన పెట్టి, ఆఫీసర్లు మరోసారి సర్వే చేసి అర్హులను ఎంపిక చేసేలా చూడాలని కొందరు జిల్లా కలెక్టర్‌‌‌‌ను, రాష్ట్ర ఎస్సీ కమిషన్​ను ఆశ్రయించారు.

అన్ని జిల్లాల్లోనూ..

వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేటలో దళితబంధు పథకానికి 13 మందిని ఎంపిక చేశారు. వారిలో టీఆర్ఎస్ లీడర్లు, ఆర్థికంగా ఉన్నవారే ఉండడంతో పేద దళితులు ఆందోళనలకు దిగారు. గత ఆదివారం హైవేపై రాస్తారోకో చేసి సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలో టీఆర్ఎస్ లీడర్లను, భూములు, కార్లు ఉన్నవాళ్లను దళితబంధుకు ఎంపిక చేశారని ఆరోపిస్తూ ఈ నెల 11న కుల వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో తహసీల్దార్‌‌‌‌‌‌‌‌కు వినతిపత్రం అందించారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గోధూర్‌‌‌‌‌‌‌‌లో దళితబంధుకు టీఆర్ఎస్ నాయకులను ఎంపిక చేయడంతో గ్రామంలో ప్రతిపక్ష నేతలు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండలో టీఆర్ఎస్ ఎంపీటీసీ, వార్డు సభ్యులు కలిసి వాళ్ల బంధువులనే దళితబంధుకు ఎంపిక చేశారని, ఆ లిస్టు వెంటనే రద్దు చేయాలని గ్రామ సర్పంచ్ లక్ష్మయ్య ఇటీవల రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆమోయ్​కుమార్ కు ఫిర్యాదు చేశారు. ఎంపిక చేసినోళ్లలో పలువురికి భూములు, సొంత ఇండ్లు, కార్లు ఉన్నాయని ఆధారాలతో సహా అందజేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం వల్లెంకుంటలో అనర్హులను ఎంపిక చేశారని ఆరోపిస్తూ ఇటీవల 30 మంది దళితులు కొయ్యూరు ప్రెస్ క్లబ్ లో సర్పంచ్ తీరుపై మండిపడ్డారు. పాలమూరు జిల్లా గండీడ్ మండలం వెన్నాచెడ్‌‌‌‌లో దళితబంధు స్కీం కింద నలుగురు టీఆర్ఎస్ లీడర్లను ఎంపిక చేశారు. వీరిలో ఒకరు ఎంపీటీసీ భర్త కాగా.. ఈయనకు 6 ఎకరాల భూమి ఉంది. మరో ఫ్యామిలీలో ఇద్దరికి గవర్నమెంట్ జాబ్స్, ​ఏడెకరాల అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. మరో వ్యక్తి ఇంట్లో ఇద్దరికి గవర్నమెంట్ జాబ్స్. 4 ఎకరాల ల్యాండ్ ఉంది. దీంతో లిస్టులో వీరిని తొలగించి అర్హుల పేర్లు చేర్చాలని ఈ నెల 5న గ్రామ పంచాయతీ ఎదుట నిరసన తెలిపారు. కానీ పేర్లను తొలగించకపోవడంతో 7న మహబూబ్‌‌‌‌నగర్ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ను కలిసి, వినతిపత్రం అందజేశారు.

దళారుల దందా

దళితబంధు ఇప్పిస్తామంటూ దళారులు లక్ష నుంచి 2 లక్షల దాకా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల మెదక్ జిల్లా టేక్మాల్ మండలం హసన్ మహమ్మద్ పల్లి (ఎచ్చంపల్లి)లో ఆఫీసర్లు సర్వేకు వచ్చారు. ఈ గ్రామంలో 60 దళిత ఫ్యామిలీలు ఉండగా.. గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షలు డిమాండ్ చేశాడు. పలువురు లక్ష దాకా ముట్టజెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని గుడిబండలో దళిత బంధు స్కీమ్‌‌‌‌కు ఎంపిక చేస్తామంటూ ముఖ్య నేత పేరుతో కొంతమంది దళారులు రూ.2 లక్షల చొప్పున వసూలు చేసినట్లు తెలిసింది. ఎవరైనా అడిగితే ఖర్చులు ఉంటాయని సమాధానం చెప్తున్నారని దళితులు అంటున్నారు. హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్ నియోజకవర్గంలోని చింతలపాలెం మండలం కిష్టాపురం, పాలకీడు మండలం కోమటికుంటలోనూ లక్ష చొప్పున వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. పాలమూరు జిల్లా మహ్మదాబాద్ మండల కేంద్రంలో ఐదుగురిని, నంచర్ల గ్రామ పంచాయతీలో ఐదుగురు పేర్లను దళితబంధు లిస్టులో చేర్చారు. వీరికి స్కీం అలాట్ అయిన వెంటనే, ఒక్కొక్కరు రూ.2 లక్షలు చొప్పున ఇతర లీడర్లకు ఇవ్వాలని ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిసింది. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో దళిత బంధుకు సెలెక్ట్ చేసిన 17 మందికి పైసలు వచ్చాక 2 లక్షల చొప్పున అక్కడి ఓ ప్రజాప్రతినిధికి ఇచ్చేలా అగ్రిమెంట్ చేసుకున్నారు.

ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకే

నియోజకవర్గానికి 100 కుటుంబాల చొప్పున రాష్ట్రంలోని 118 నియోజకవర్గాల్లో మొదటి విడత దళితబంధు అమలుచేయాలని టీఆర్ఎస్ సర్కారు నిర్ణయించింది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎంపిక బాధ్యతను ఆఫీసర్లకు కాకుండా లోకల్ ఎమ్మెల్యేలకు అప్పగించింది. ఎమ్మెల్యే సలహాతో దళిత బంధు లబ్ధిదారులను ఎంపిక చేసి, ఆ లిస్టును జిల్లా ఇన్‌‌చార్జి మంత్రితో ఆమోదింపజేసుకోవాలని, వాటినే కలెక్టర్లు ఫైనల్ చేయాలని తేల్చిచెప్పింది. ఈమేరకు మినిస్టర్ కొప్పుల ఈశ్వర్, సీఎస్ సోమేశ్ కుమార్‌‌‌‌తో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌‌లో కలెక్టర్లకు క్లారిటీ ఇచ్చారు. ఫిబ్రవరి 5 కల్లా లిస్టులు ఫైనల్ చేయాలని, మార్చిలో 100 శాతం యూనిట్ల గ్రౌండింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు.

ఎమ్మెల్యేల నుంచి కుల పెద్దలకు ఫోన్లు

మొదటి విడత దళితబంధును నియోజకవర్గంలో 100 మందికే ఇస్తుండడంతో చాలా గ్రామాల నుంచి ఒక్కో లబ్ధిదారుడినే ఎంపిక చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఎంపిక బాధ్యతను చూస్తున్న ఎమ్మెల్యేలు ఆయా గ్రామాల్లోని కులపెద్దలకు ఫోన్ చేసి ఎవరో ఒకరి పేరు ఫైనల్ చేసి పంపాలని సూచిస్తున్నారు. దీంతో గ్రామాల్లోని దళితులు తమలో ఒకరి పేరును ఆఫీసర్లకు పంపుతున్నారు. స్కీం కింద డబ్బులు రాగానే కులానికి అప్పగించేలా తీర్మానాలు చేయిస్తున్నారు. ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో ఓ కులసంఘం ఇలాంటి తీర్మానం చేసింది. ఆ అగ్రిమెంట్ కాపీ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆఫీసర్ల సూచన మేరకు గ్రామంలో ఈ నెల 4న కులపెద్దలంతా సమావేశమయ్యారు. భూమయ్య అనే వ్యక్తి పేరును దళితబంధు స్కీంకు ఎంపిక చేసి పంపించారు. దళితబంధు రాగానే ఆ మొత్తాన్ని కులానికి ఇచ్చేలా తీర్మానం రాసి సంతకం పెట్టించుకున్నారు. 26 మంది సభ్యులు కూడా సంతకాలు చేశారు. నాగర్​కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలోనూ  టీఆర్ఎస్ కు చెందిన 10 మంది లీడర్ల పేర్లను లిస్టులో చేర్చారు. పైసలు వచ్చాక మరో 10 మందితో కలిసి ఒక్కొక్కరు రూ.5 లక్షల చొప్పున పంచుకోవాలని బాండ్ పేపర్​మీద రాసుకున్నారు. ఇలాంటి తీర్మానాలు చాలా గ్రామాల్లో జరుగుతున్నా బయటకు రావడం లేదు.