గుర్రంపై బరాత్: దళిత కులాన్ని బహిష్కరించిన సర్పంచ్

గుర్రంపై బరాత్: దళిత కులాన్ని బహిష్కరించిన సర్పంచ్

ఓ దళిత యువకుడు గుర్రం పై పెళ్లి బరాత్ తీసుకున్నాడని ఆ కులాన్నే గ్రామం నుంచి బహిష్కరించాడు ఆ ఊరి సర్పంచ్. ఈ ఘటన గుజరాత్ లోని మెహ్ సానా జిల్లా.. లోర్ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ నెల 7వ తేదీన మెహుల్ (24) అనే దళిత యువకుడి పెండ్లి జరిగింది. అయితే అదే రోజు సాయంత్రం వైభవంగా పెళ్లి కొడుకును బరాత్ తీశారు బందువులు. ఇది చూసి ఓర్వలేని ఆ ఊరి సర్పంచ్ మరుసటి రోజు పంచాయితీ ఏర్పాటు చేసి దళిత కులం మొత్తాన్ని ఊరినుంచి బహిష్కరిస్తున్నట్లు ఆర్డర్ వేశాడు. ఈ పంచాయితీలో ఆ ఊరి సర్సంచ్ వీజూ, డిప్యుటీ సర్పంచ్ బల్ దేవ్, బోపా ఠాకూర్, మను బారోట్, గాబా ఠాకూర్ లు ఉన్నారు.

దళితులు తమ లిమిట్స్ ను దాటుతున్నారని  లోర్ గ్రామ సర్పంచ్ వీజూ ఆరోపించాడు. దళితులు గుర్రంపై బరాత్ తీసుకోవడం ఏంటని ప్రశ్నించాడు.  ఇందుకు శిక్షగా.. సదరు దళిత కులం మొత్తాన్ని ఊరి నుంచి బహిష్కరిస్తున్నట్లు హుకూం జారీ చేశాడు. ఈ రోజునుంచి దళితులకు ఎవరైనా సరుకులను అమ్మడం, నీళ్లు ఇవ్వడం లాంటివి చేయవద్దని గ్రామ ప్రజలకు ఆర్డర్ వేశాడు. తమ తీర్పును వ్యతిరేకిస్తే గ్రామ ప్రజలకు 5 వేల రూపాయల జరిమానా విధిస్తామని చెప్పాడు. ఈ విషయంపై..  సదరు దళిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ ఊరి సర్పంచ్ తో పాటు తీర్పులో భాగం అయిన మరో నలుగురిపై… అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు పోలీసులు.