దళిత యువతి ఘటన : దోషులపై సీరియస్​ యాక్షన్​కు మంత్రి సత్యవతి ఆదేశాలు

దళిత యువతి ఘటన : దోషులపై సీరియస్​ యాక్షన్​కు మంత్రి సత్యవతి ఆదేశాలు

హనుమకొండ, వెలుగు: హనుమకొండలో లా చదువుతున్న దళిత యువతిపై అత్యాచారానికి సంబంధించి  జిల్లా అధికార యంత్రాంగం విచారణ ప్రారంభించింది. ఈ ఘటనపై మంత్రి సత్యవతి రాథోడ్​, ఇతర లీడర్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనతో సంబంధం ఉన్నవాళ్లు ఎంతటివారైనా వదిలిపెట్టవద్దని, నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సత్యవతిరాథోడ్ జిల్లా అధికారులను ఆదేశించారు. దీంతో ఘటనకు సంబంధించిన పూర్వాపరాలను తెలుసుకోవాల్సిందిగా కలెక్టర్​ రాజీవ్​ గాంధీ హనుమంతు ప్రత్యేక టీమ్​ను  నియమించారు.  ఈ మేరకు  డీఆర్వో ఎం.వాసుచంద్ర, హనుమకొండ తహసీల్దార్​ జి.రాజ్​కుమార్, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్​ఆఫీసర్​సబిత, సఖి వన్​స్టాప్​సెంటర్​అడ్మిన్​ హైమావతి, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి డాక్టర్ ​కె.అనితా రెడ్డి శనివారం బాలసముద్రంలోని శివశంకర్​ హాస్టల్​వద్దకు వెళ్లారు. ఆ సమయంలో హాస్టల్​కు తాళం వేసి ఉండటంతో చుట్టుపక్కల వారిని అడిగి వివరాలు సేకరించారు.  

ఘటనలో ప్రధాన నిందితులైన విజయ్ కుమార్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే పీఏ వేముల శివ, హాస్టల్ నిర్వాహకురాలు శోభపై హనుమకొండ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు కాగా వారు రిమాండ్ లో ఉన్నట్లు తెలుసుకున్నారు.  బాధిత యువతి ప్రస్తుతం స్వగ్రామంలో తల్లిదండ్రుల వద్ద క్షేమంగా ఉన్నట్లు గుర్తించిన అధికారులు వారితో ఫోన్​లో మాట్లాడారు. హాస్టల్ ​లైసెన్స్​ రద్దు చేయాలని, ఈ విషయంలో వెంటనే యాక్షన్​ తీసుకోవాలని మున్సిపల్​ హెల్త్ ఆఫీసర్​ను కలెక్టర్​ ఆదేశించారు. కనీస ప్రమాణాలు పాటించని, లైసెన్సులు లేని హాస్టల్స్​నిర్వహించకూడదని, లేడీస్ హాస్టల్స్​లో ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. మళ్లీ ఇలాంటి ఘటన పునరావృతమైతే  నిర్వాహకులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పరిశీలన బృందంలో సఖీ వన్ స్టాప్ సెంటర్ లీగల్ కౌన్సిలర్ శ్రీదేవి, ఐసీడీఎస్ సూపర్​ వైజర్​వంచ రాజ్యలక్ష్మి తదితరులున్నారు.