మథుర (యూపీ): దళిత బాలికపై ముగ్గురు వ్యక్తులు కదులుతున్న కారులో గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను రోడ్డు పక్కకు తోసేశారు. గురువారం మథురలో ఈ ఘటన జరిగింది. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బాలిక (13) సమీపంలోని దుకాణానికి వస్తువులు కొనుగోలు చేయడానికి వెళ్లింది. అక్కడే ఉన్న నీరజ్ అనే వ్యక్తి మత్తు పదార్థాలు కలిగిన వాటర్ బాటిల్ ను ఆమెకు ఇచ్చాడు.
ఆ నీళ్లు తాగగానే ఆమె స్పృహ తప్పి పడిపోయింది. నీరజ్, అతడి స్నేహితుడు శైలేంద్ర, మరో వ్యక్తి వెంటనే ఆమెను కారులోకి తీసుకెళ్లారు. కదులుతున్న కారులో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. బర్సానా రోడ్ ప్లై ఓవర్ కింద పడేసి పారిపోయారు. స్పృహలోకి వచ్చిన బాలిక ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. బాలిక ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండటంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు ఆమె రేప్‌కు గురైందని నిర్ధారించారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును నమోదు చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.