
అర్ధరాత్రి బైక్ పై వెళ్తున్న ఓ యువకుడిని అడ్డగించిన దొంగలు..అతడి దగ్గరున్న నగదు, బైక్ ను దొంగిలించారు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఏం చేయాలో తెలియక ఏడుస్తూ పక్క గ్రామానికి నడుచుకుంటూ వెళ్లి ఓ గుడిలో పడుకున్నాడు. ఇదే అతడు చేసిన అతిపెద్ద తప్పు అయ్యింది. అసలే డబ్బు, బైక్ పోగొట్టుకుని బాధతో ఉన్న అతడికి గుడి పూజారులు ఘోరంగా అవమానించారు. ఓ దళితుడు ఆలయంలోకి ప్రవేశించాడని అతడిని నగ్నంగా ఊరేగించారు. కొబ్బరి చెట్టుకు కట్టేసి తీవ్రంగా చితకబాదారు. ఈ అమానవీయ సంఘటన కర్ణాటకలోని గుండ్లుపేట తాలుకాలోని మాద్రహళ్లిలో జూన్ 3వ తేదీన చోటు చేసుకోగా ఆలస్యంగా బయటపడింది.
వివరాల్లోకి వెళ్తే..
ప్రతాప్ అనే యువకుడు జూన్ 2వ తేదీన రాత్రి మైసూర్ నుంచి శ్యాన్డ్రహళ్లికి బయల్దేరాడు. దారిలో ఆ యువకుడిని కొంతమంది దుండగులు అడ్డగించి.. అతడి వద్ద ఉన్న నగదును, బైక్‌ను దొంగిలించారు. దీంతో ప్రతాప్.. మాద్రహళ్లికి సమీపంలో ఉన్న శనేశ్వర ఆలయానికి చేరుకున్నారు. ఆ రాత్రి అక్కడే నిద్రించాడు. 3వ తేదీన ఉదయం ఆలయం వద్దకు చేరుకున్న పూజారి.. ప్రతాప్‌ను చూసి.. అతని కులం ఏదని ప్రశ్నించాడు. దళితుడనని చెప్పేసరికి ప్రతాప్‌ను అక్కడే బంధించాడు. మరికొంత మందిని పిలిచి.. ప్రతాప్‌ను కొబ్బరి చెట్టుకు కట్టేసి.. ఆలయాన్ని అపవిత్రం చేశావంటూ.. అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ చితకబాదారు. అంతటితో ఆగకుండా.. బాధితుడి బట్టలూడదీసి నగ్నంగా ఊరేగించారు. ఈ వీడియోలో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి ప్రతాప్‌పై దాడికి పాల్పడ్డ ఆరుగురిని అరెస్టు చేశారు.