దళిత బంధు పైసల కోసం లబ్ధిదారుల ఆందోళన

దళిత బంధు పైసల కోసం లబ్ధిదారుల ఆందోళన
  •     హుజూరాబాద్‌లో ఎస్సీ కార్పొరేషన్ ఈడీని అడ్డుకున్న లబ్ధిదారులు
  •     డబ్బులు డ్రా చేసుకోమంటూ మెసేజ్​లు..  
  •     తమకు ఆర్డర్స్​రాలేదన్న బ్యాంకు సిబ్బంది
  •     ఇంకెన్నాళ్లు ఇబ్బంది  పెడుతరని నిలదీత

హుజూరాబాద్, వెలుగు: హుజూరాబాద్‌లో దళిత బంధు స్కీం కింద ఎంపికైన లబ్ధిదారుల పరిస్థితి ఎక్కే మెట్టు, దిగే మెట్టు అన్నట్టుగా తయారైంది. అకౌంట్లలో 10 లక్షలు పడినా పైసా చేతికి రావట్లేదు. తాజాగా డెయిరీ యూనిట్లు ఎంపిక చేసుకున్న లబ్ధిదారులకు షెడ్ల ఏర్పాటు కోసం లక్షా 50 వేలు డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని మెసేజ్‌లు వచ్చాయి. దీంతో సోమవారం హుజూరాబాద్‌లోని ఎస్‌బీఐకి చేరుకున్న లబ్ధిదారులకు బ్యాంకు ఆఫీసర్లు షాక్ ఇచ్చారు. తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని, డబ్బులు రిలీజ్ ​చేయాలని ఆర్డీవో ఆఫీసు నుంచి లెటర్ తీసుకురావాలని చెప్పారు. అక్కడికి వెళ్తే సర్కారు నుంచి ఇంకా ఆర్డర్స్​ లేదని, ఇంకా టైం పడుతుందని అన్నారు. దీంతో బాధితులు అక్కడే ఆందోళనకు దిగారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీని అడ్డుకున్నారు.

మెసేజ్‌లు పంపిన్రు.. ఆర్డర్స్ రాలేదన్నరు
హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అమలుకు సంబంధించి ఆఫీసర్లు చెబుతున్న మాటలకు, చేతలకు పొంతన ఉండటం లేదు. ఇప్పటికే 17 వేల మందికి పైగా అకౌంట్లలో రూ.10 లక్షల చొప్పున డబ్బులు జమ చేసినట్లు ఆఫీసర్లు చెబుతున్నా వాటిని డ్రా చేసుకోలేని పరిస్థితి కల్పించారు. నియోజకవర్గంలో డెయిరీ యూనిట్లకు 1,509 మంది ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టు కోగా, వీరిలో 1,104 మందికి షెడ్ల నిర్మాణానికి స్థలం ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 801 మందికి కరీంనగర్‌‌లో ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ పూర్తయిన లబ్ధిదారులు తమ స్థలాల్లో షెడ్లు నిర్మించుకునేందుకు లక్షా50 వేలు రిలీజ్ చేశామని, వాటిని డ్రా చేసుకోవచ్చని శుక్ర, శనివారాల్లో మెసేజ్‌లు వచ్చాయి. ఆదివారం సెలవు కావడంతో లబ్ధిదారులు హుజూరాబాద్‌లోని ఎస్‌బీఐకి సోమవారం చేరుకున్నారు. విత్​డ్రాయల్ ఫామ్స్ నింపి, కౌంటర్ వద్దకు వెళ్తే.. 1.5 లక్షలు ఇవ్వాలని తమకు ఆర్డర్స్ రాలేదని బ్యాంకు సిబ్బంది చెప్పారు. ఆర్డీవో ఆఫీసు నుంచి లెటర్ తెస్తే డ్రా చేసుకునే వీలు కల్పిస్తామని మేనేజర్ అన్నారు.

ఎన్ని రోజులు తిప్పుకుంటరు
లబ్ధిదారులంతా బ్యాంకు నుంచి నేరుగా ఆర్డీవో ఆఫీసుకు వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన దళిత బంధు సెంటర్‌‌లో సంప్రదించారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చే దాకా ఫండ్స్ రిలీజ్ చేయలేమని, ఇందుకు ఇంకా 3 రోజుల టైం పడుతుందని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేశ్ చెప్పారు. దీంతో లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. కారు ఎక్కబోతున్న ఈడీని అడ్డుకున్నారు. ఇంకా ఎన్ని రోజులు తిప్పుకుంటారంటూ నిలదీశారు. నెలరోజులుగా తిప్పించుకుం టున్నారని, కూలి చేసుకుంటే తప్ప బతకలేని తమను ఇలా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. సోమవారం కూడా కూలి నష్టపోయామని, తమకు కూలి డబ్బులు చెల్లించాలని డిమాండ్​ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వారికి నచ్చజెప్పి సాధ్యమైనంత త్వరగా డబ్బులు వచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పడంతో దళిత బంధు లబ్ధిదారులు ఆందోళన విరమించారు.