
- గొర్లు, బర్లు ఇయ్యలె
- ఆ నిధులతో షెడ్లు నిర్మించి ఉత్తగనే పెట్టిన లబ్ధిదారులు
- మిగతా పైసల కోసం నెలల తరబడి ఎదురుచూపు
హైదరాబాద్, వెలుగు: సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధు స్కీం అమలు ముందుకు పడటంలేదు. స్కీంలో భాగంగా బర్లు, గొర్ల బిజినెస్‌కు నిర్మించిన షెడ్లు ఖాళీగా ఉంటున్నాయి. ప్రభుత్వం రూ. లక్షన్నర మాత్రమే సాయం చేయడంతో లబ్ధిదారులు షెడ్లు మాత్రమే నిర్మించి వదిలేశారు. బర్లు, గొర్లు కొనడానికి పైసల్లేక షెడ్లు ఉత్తగనే ఉంటున్నాయి. మిగతా డబ్బుల కోసం సుమారు ఐదు వేల మంది దాకా లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరానివే సర్కారు ఇంకా రూ. 300 కోట్లు పెండింగ్‌లో పెట్టింది. ఈ పైసలు వస్తనే పనులు ముందుకు జరగనున్నాయి. మొత్తంగా ఇప్పటి దాకా రాష్ట్ర వ్యాప్తంగా 23 వేల మందికి మాత్రమే దళిత బంధు గ్రౌండింగ్ అయినట్లు లెక్కలు చెప్తున్నాయి. ఒక్క హుజూరాబాద్‌లో 11 వేల మందికి నిధులు గ్రౌండ్ అయ్యాయి. అయితే డెయిరీకి ఇచ్చిన ఐదు వేల మంది సంఖ్యను కూడా ఇందులో కలపడం గమనార్హం.
ఉత్తగనే షెడ్లు..
రాష్ట్ర ప్రభుత్వం గతేడాది దళిత బంధు స్కీం తీసుకొచ్చింది. ప్రతి దళిత కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థికసాయం అందిస్తోంది. మొదట హుజూరాబాద్ నియోజకవర్గం, యాదాద్రి జిల్లా వాసాలమర్రి, నాలుగు నియోజకవర్గాల్లోని నాలుగు మండలాలను ఎంపిక చేసింది. ఇక్కడ అన్ని ఎస్సీ కుటుంబాలకు దళిత బంధు ఇస్తామని సర్కారు ప్రకటించింది. ఆ తర్వాత నియోజకవర్గానికి వంద మందికి చొప్పున ఇస్తోంది. రూ. 10 లక్షలతో లబ్ధిదారులు తమకిష్టమైన, అనుభవం ఉన్న బిజినెస్‌లు ఎంచుకునే అవకాశం కల్పించింది. అనేక మంది ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, సీడ్స్, పెస్టిసైడ్, ఫెర్టిలైజర్స్, హోటల్ అండ్ క్యాటరింగ్, మట్టి ఇటుకల మార్కెటింగ్, వరి ట్రాన్స్ప్లాంటర్లు, కోళ్ల ఫారాలు, మినీ డెయిరీ ఫారాలను ఎంచుకున్నారు. అయితే దాదాపు అనేక రకాల బిజినెస్‌లకు డబ్బులు ఒకేసారి గ్రౌండింగ్ అవుతున్నాయి. కానీ డైయిరీ, గొర్ల పెంపకానికి వచ్చేసరికి పరిస్థితి మారింది. గ్రౌండింగ్‌లో భాగంగా మొదట రూ. లక్షన్నర రిలీజ్ చేస్తున్నారు. ఈ డబ్బులతో షెడ్లను నిర్మించుకోవాలి. ఆ తర్వాత మిగతా డబ్బులను విడుదల చేస్తారు. ఇంత వరకు బాగానే ఉన్నా షెడ్లు నిర్మించాక కూడా మిగతా పైసలు రిలీజ్ కావడంలేదు. దీంతో షెడ్లు నెలల తరబడి ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇట్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నాలుగు వేల షెడ్ల దాకా ఉత్తగనే ఉంటున్నాయి.
నిరుటి నిధులే 300 కోట్లు పెండింగ్
దళిత బంధు స్కీం కోసం 2021–-22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ. 4,441 కోట్లు కేటాయించింది. ఇందులో హుజూరాబాద్‌కే రూ. 2 వేల కోట్ల దాకా అలకేట్ చేసింది. అయితే రాష్ట్ర సర్కారు ఇంకా రూ. 300 కోట్లను పెండింగ్‌లో పెట్టింది. ఈ డబ్బులు వస్తనే బర్లు, గొర్ల కొనుగోలుకు లబ్ధిదారులకు ఇవ్వనున్నారు. కానీ నిధులు లేకపోవడంతో సర్కారు ఫండ్స్ రిలీజ్ చేయడంలేదు. ఇక ఈ ఆర్థిక సంవత్సరానికి 1.75 లక్షల కుటుంబాలకు దళిత బంధు ఇవ్వాలనే లక్ష్యంతో బడ్జెట్లో రూ. 17,700 కోట్లను కేటాయించారు. దీనికి సంబంధించి ఇటీవల బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ కూడా ఇచ్చారు. కానీ జీవో ఇచ్చినా ఇప్పటి దాకా ఒక్కపైసా కూడా విడుదల చేయలేదు.
స్లోగా సాగుతున్న పథకం
రాష్ట్రంలో దళిత బంధు స్కీంలు స్లోగా సాగుతోంది. పైలెట్ ప్రాజెక్ట్ గా పథకాన్ని ప్రారంభించిన హుజూరాబాద్ మొదలుకొని 118 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది. 40 వేల మంది లబ్దిదారులకు 4 వేల కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. మార్చి 31వ తేదీ నాటికి 40 వేల మందికి నిధులను గ్రౌండింగ్ చేస్తామని స్వయంగా సీఎం కేసీఆర్, మంత్రులు ప్రకటించినా ముందుకు పడలేదు. మార్చి గడచి రెండు నెలలు దాటిపోయింది. ఇప్పటి దాకా సగం మంది లబ్ధిదారులకు మాత్రమే గ్రౌండింగ్ పూర్తయింది. ఇక లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నా గ్రౌండింగ్ మాత్రం కావడంలేదు.