ఉన్న ఇండ్లు కూలగొట్టుకున్నా కొత్త ఇండ్లు కట్టలేదు

ఉన్న ఇండ్లు కూలగొట్టుకున్నా కొత్త ఇండ్లు కట్టలేదు
  • సొంత జాగాల్లో డబుల్​ బెడ్​రూం స్కీమ్​కు కాంట్రాక్టర్ల బ్రేకులు
  • ఏడాదిగా వంద కుటుంబాల ఇబ్బందులు..
  • ఒక్కో ఇంటికి రూ.60 వేలు వసూలు చేసిన కాంట్రాక్టర్​..
  • ప్రభుత్వ బిల్లులు రాలేదని 5 నెలలుగా  పనులు పెండింగ్​
  •  ఇండ్లు కట్టివ్వాలని బాధితుల డిమాండ్​ 

 వనపర్తి / పెబ్బేరు, వెలుగు : సొంత జాగాలో డబుల్ బెడ్​రూం​ ఇండ్లు కట్టిస్తమంటే నమ్మిన నిరుపేద దళితులు ఉన్న ఇండ్లు కూల్చుకుని  ఇబ్బందులు పడుతున్నారు. కొత్త ఇండ్ల నిర్మాణాలను కాంట్రాక్టర్  పిల్లర్ల కాడనే  ఆపేయడంతో  ఆందోళన చెందుతున్నారు.  ‘డబుల్’ ఇల్లు కట్టేందుకు  ప్రభుత్వం ఇచ్చే సాయం సరిపోదని, ఒక్కో ఇంటికి రూ. 60 వేలు అదనంగా వసూలు చేసిన  కాంట్రాక్టర్.. ప్రభుత్వం నుంచి ​బిల్లులు వస్తలేవని పనులు ఏడియాడనే వదిలేశాడు.  5 నెలలుగా పనులు పెండింగ్​పెట్టడంతో నిరుపేదలు గుడిసెల్లో ఉండలేక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. పిల్లర్ల నిర్మాణంలోనూ క్వాలిటీ లేని మెటీరియల్ వాడడంతో సిమెంట్​రాలుతూ, సీకులు తుప్పుపడుతున్నాయని చెప్తున్నారు. 

వంద ఇళ్లకు మంత్రి శంకుస్థాపన..

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామంలోని ఎస్సీ కాలనీలో 100 డబుల్​బెడ్​రూం ఇండ్ల నిర్మాణానికి  మంత్రి నిరంజన్ రెడ్డి ఏడాది కింద శంకుస్థాపన చేశారు. గ్రామంలో ప్రభుత్వ స్థలాలు లేకపోవడంతో ఎవరి స్థలంలో  వారు ఇల్లు కట్టుకునేందుకు తమ పాత ఇండ్లను కూల్చి అధికారులకు స్థలాలు అప్పగించారు.  6 నెలల్లో ఇండ్ల నిర్మాణం పూర్తి చేస్తామని అధికారులు, కాంట్రాక్టర్​హామీ ఇచ్చారు. ప్రభుత్వం మొదటి విడతలో మంజూరు చేసిన నిధులతో కాంట్రాక్టర్ పనులు చేపట్టారు. రెండో విడత  నిధులు మంజూరు చేయకపోవడంతో పనులు 6 నెలలుగా నిలిచిపోయాయి. ఇంతకాలం ఎండాకాలం కావడంతో గుడిసెల్లో ఏదో విధంగా కాలం వెల్లదీసిన నిరుపేదలు వర్షాకాలం షురూ కావడంతో గుడిసెల్లో ఎలా ఉండాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

డబ్బులిచ్చినా ఇండ్లు కడ్తలేరు..

సాధారణంగా ప్రభుత్వ స్థలాల్లో డబుల్ బెడ్​రూం ఇండ్లు ప్రభుత్వ స్థలంలో కట్టి నిరుపేదలను ఎంపిక చేసి పంపిణీ చేస్తారు. కానీ గుమ్మడం గ్రామంలో ప్రభుత్వం స్థలం లేనందున సొంత జాగాల్లో  క్వాలిటీగా ఇండ్లు కట్టిస్తామని  చెప్పడంతో పేదలు నమ్మారు.  ప్రభుత్వ నిధులతో పాటు ఒక్కో ఇంటికి  రూ.1.50 లక్షలు అదనంగా ఇవ్వాలని చెప్పడంతో అందరూ కలిసి మాట్లాడి రూ. 60 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.  భూమి పూజ చేసి  పనులు మొదలు పెట్టాక  రూ.25 వేలు చెల్లించారు. బేస్ మెంట్ కోసం రాయినీ మట్టిని లబ్ధిదారులే సొంత ఖర్చుతో తెప్పించుకున్నారు. ఇదే కాక  ఇంటి దర్వాజ, కిటికీల ఖర్చులు కూడా లబ్ధిదారులే భరించాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. అయినా  ఇండ్ల నిర్మాణం పెండింగ్​పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పాడవుతున్న మెటీరియల్

నిర్మాణపనులు ఆపెయ్యడంతో  సిమెంటు ఇటుకలు, పిల్లర్లకు వేసిన సీకులు పాడవుతున్నాయని లబ్ధిదారులు వాపోతున్నారు. తాత్కాలికంగా వేసుకున్న  గుడిసెల్లో పిల్లలతో భయంభయంగా కాలం గడుపుతున్నామని వాపోతున్నారు. కృష్ణానది సమీపంలోని గుమ్మడం వరదొస్తే ఊరి సమీపంలోకి నీళ్లొస్తాయి. దాని వల్ల పాముల బెడద ఎక్కువగా ఉంటుందని , ఇప్పటికే చాలా పాములను చంపామని చెప్తున్నారు. కొన్ని పిల్లర్​గుంతల దశలోనే ఆపడం వల్ల  ఆ గుంతల్లో రాత్రివేళ ఎవరైనా  పడే ప్రమాదం ఉందని  వాపోతున్నారు. 

20 ఇళ్లకే శ్లాబ్​లు పడ్డయ్​

వంద ఇండ్ల నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టర్..​ ఇప్పటి వరకు 20 ఇళ్లకు మాత్రమే  శ్లాబ్​లు వేశారు. మరో ఇరవై ఇళ్లకు బేస్ మెంట్ వేసి వదిలేశారు. ఇంకో 6 ఇళ్లకు పిల్లర్లు పోసి వదిలేశారు. ముగ్గు పోసేటప్పుడు గుత్తేదార్లకు రూ. 50 వేలు కట్టామని,   ఇప్పటి దాకా రూ. 1, 00,000 ఇచ్చామని కొందరులు లబ్ధిదారులు వాపోయారు.  బిల్లులు రాలేదని కాంట్రాక్టర్​ఇండ్లు కట్టుడు ఆపేస్తే ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. 

గుడిసె వేసుకుని బతుకుతున్నం..

డబుల్  బెడ్​రూం ఇల్లు కట్టిస్తమంటే ఉన్నది ఇల్లు పడగొట్టి గుడిసె వేసుకుని బతుకుతున్నం. బేస్ మెంట్ వేశారు.. వదిలేశారు.  కాంట్రాక్టర్​పైసలు కట్టమంటే మొదటి విడతగా రూ.25 వేలు కట్టినం. మరో రూ.45 వేలు కట్టాలని చెబుతున్నారు. కానీ ఇల్లు కట్టుడు బంద్ చేసి 5 నెలలు గడుస్తోంది. ఇప్పటికైనా కట్టుడు ప్రారంభించాలి.

- చంద్రమ్మ, బాధితురాలు, గుమ్మడం 

బిల్లులు రానందుకే పనులు ఆపేసినం

డబుల్​ఇండ్లకు ఇప్పటి దాకా ఖర్చు చేసిన వాటికి బిల్లులు రాకపోవడంతో పనులు ఆపేసినం.  గుమ్మడంలోనే కాకుండా పెబ్బేరు టౌన్ లోని  జర్నలిస్టులు, పేదలకోసం నిర్మించే ఇండ్ల పనులు కూడా  పేశాం. ఈ విషయాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి  దృష్టికి కూడా తీసుకెళ్లాం. బిల్లులు రాగానే పనులు ప్రారంభిస్తాం. ఒక్కో ఇల్లు కట్టేందుకు రూ.4 నుంచి 5 లక్షల పైనే ఖర్చవుతుంది.  ప్రభుత్వం ఇచ్చే అమౌంట్​ సరిపోదు కనుక లబ్ధిదారుల వద్ద కొంత మేర వసూలు చేసి ఇండ్లు కడ్తున్నం.  

- చంద్రమౌళి రెడ్డి, కాంట్రాక్టర్'