
- తాత్కాలిక రిపేర్లకు నోచుకోకపోవడంతో ప్రజలకు తప్పని ఇబ్బందులు
- రోడ్లకు రిపేర్లు చేపట్టాలని కోరుతున్న ప్రజలు
మహబూబాబాద్ , వెలుగు: మహబూబాబాద్ జిల్లాలో గతేడాది వానాకాలం సీజన్లో భారీ వర్షాల కారణంగా పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రోడ్లు పూర్తిగా పాడయ్యాయి. పాడైన రోడ్లకు రిపేర్లు చేయకపోవడం.. వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
సమస్యలు ఉన్న ప్రాంతాలివే..
- కురవి మండలంలోని సూదనపల్లి–జయ్యారం గ్రామాల మధ్య ప్రధాన రహదారి గతేడాది కురిసిన భారీ వర్షాల కారణంగా కోతకు గురైంది. నాటి నుంచి నేటి వరకు రిపేర్లకు నోచుకోలేదు. కందికొండ, సూదనపల్లి, జయ్యారం, గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కురవి నుంచి మొగిలిచర్ల, ఉప్పరిగూడె, కొత్తతండా, ముల్కలపల్లి బ్రిడ్జి దెబ్బతింది. దీన్ని ఇప్పటి వరకు మరమ్మతులు చేయలేదు.
- నెల్లికుదురు మండలం శ్రీరామగిరి నుంచి వెంకటాపురం వెళ్లే రోడ్డు వరద కారణంగా కొట్టుకుపోయింది. నేటికి కనీసం గుంతలను పూడ్చ లేదు. కల్వర్టు వద్ద ప్రమాదకరంగా మారింది.
- తొర్రూరు మండలం హరిపిరాల నుంచి రావులపల్లికి వెల్లె రహదారిలో లోలెవల్ బ్రిడ్జి సమీపంలో రోడ్డు కోతకు గురైంది.
- దంతాలపల్లి మండల కేంద్రంలో వరంగల్–ఖమ్మం ప్రధాన రహదారి పై భారీ గుంత ఏర్పడింది.
దెబ్బతిన్న రోడ్ల రిపేర్లకు చర్యలు
జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్లు వర్షాలకు దెబ్బతిన్న చోట తగిన మరమ్మతులు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే మంజూరైన పనుల్లో రాజుల కొత్తపల్లి నుంచి వెంకటాపూర్, రావిరాల రోడ్, బొమ్మకల్ నుంచి ఆర్సీ తండా, అవుతాపురం నుంచి కొడకండ్ల రోడ్, కొమ్మనపల్లిరోడ్, చెర్లపాలెం నుంచి హరిపిరాల, బోజ్యతండా రోడ్ పనులు ప్రగతి దశలో ఉన్నాయి. అవసరమైన చోట్ల రిపేరుకు ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపుతాం.
విద్యాసాగర్ పీఆర్ఈఈ, మహబూబాబాద్