హైదరాబాద్: ఖైరతాబాద్ ఉప ఎన్నికకు రెడీగా ఉన్నానని.. ఎన్నిక ఎప్పుడూ వచ్చిన పోటీకి సిద్ధమని దానం నాగేందర్ ప్రకటించారు. ఇక ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని ప్రకటించారు. ప్రజల ఆశీస్సులతో మళ్లీ ఎమ్మెల్యేగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక అన్నీ మాట్లాడతానని స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో దానం నాగేందర్ శాసన సభ సభ్యత్వంపై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
దేశ సర్వోన్నత న్యాయస్థానంలోనూ ఆయనకు ఊరట దక్కలేదు. దానంపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పును సుప్రీం కోర్టు సమర్ధించింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు తీర్పుపై దానం నాగేందర్ స్పందించారు. సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పును ముందే ఊహించా. కానీ టెన్త్ షెడ్యూల్ ప్రకారం ఊరట ఉంటుందని కొందరి సూచనతో లీగల్‌గా ప్రయత్నం చేశానని చెప్పారు.
తాను ఎల్లప్పడూ ప్రజల మధ్యలోనే ఉంటానని.. ఇక ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని స్పష్టం చేశారు. ప్రజల మధ్య ఉండే వ్యక్తిగా పార్టీ మార్పు ప్రభావం తనపై ఉంటుందని అనుకోవడం లేదన్నారు. ప్రజాక్షేత్రంలో తనకు బలం ఉందని.. ప్రజలు తనను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో మూడుసార్లు ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచా.. ఒక ఉప ఎన్నికలో 1600 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయానని గుర్తు చేశారు.
ఇప్పుడు కూడా తనకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. ఇకపై ఖైరతాబాద్ నియోజకవర్గానికే పరిమితమవుతానని పేర్కొన్నారు. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననే అంశంపై తర్వాత మాట్లాడుతానని పేర్కొన్నారు. పోటీపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఇస్తారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని.. ప్రజల కోసం పాటు పాటు పడుతుందని అన్నారు.
