- ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటును సవాల్ చేసిన దానం
న్యూఢిల్లీ, వెలుగు: ఎమ్మెల్యే పదవికి అనర్హత విధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ దాఖలు చేసిన పిటిషన్ గురువారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ (సీజేఐ) బెంచ్ ముందుకు రానుంది. దానం తరఫున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ సోమవారం సీజేఐ ధర్మాసనం ముందు పిటిషన్‌ను మెన్షన్ చేసిన విషయం తెలిసిందే. అయితే బుధవారం సీజేఐ బెంచ్, రాజ్యాంగ ధర్మాసనం ముందస్తుగా లిస్టయిన కేసుల విచారణలో ఉండటంతో దానం పిటిషన్ విచారణకు రాలేదు.
ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఫామ్‌పై పోటీ చేశారు. దీంతో ఆయనపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్, బీజేపీ నేతలు అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ జరిపిన స్పీకర్.. దానం చట్టపరంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడలేదని మార్చి 11న తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు.
దీనిపై సుదీర్ఘ విచారణ చేపట్టిన హైకోర్టు సీజే బెంచ్.. గత శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయడంతో పాటు స్పీకర్ ఇచ్చిన నిర్ణయాన్ని పక్కనపెట్టింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసినప్పటి నుంచే అనర్హత అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. అలాగే ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు స్పీకర్, ఎన్నికల కమిషన్‌కు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ ఈ నెల 19న సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేశారు. మరోవైపు దానం పిటిషన్‌పై నిర్ణయం తీసుకునే ముందు తమ వాదనలు కూడా వినాలని కోరుతూ కౌశిక్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి కేవియట్‌లు దాఖలు చేశారు. దీంతో గురువారం సీజేఐ బెంచ్‌లో జరిగే విచారణపై ఆసక్తి నెలకొంది.
