టిప్పర్ కింద పడ్డ కోడి పెట్ట.. 5 వేలు ఇచ్చేదాకా వదిలిపెట్ట!

టిప్పర్ కింద పడ్డ కోడి పెట్ట.. 5 వేలు ఇచ్చేదాకా వదిలిపెట్ట!

కాగజ్ నగర్, వెలుగు : టిప్పర్ వెళ్తుంటే అనుకోకుండా ఓ కోడిపెట్ట అడ్డం వచ్చి టైర్​ కింద పడి చనిపోయింది. దీంతో ఊరోళ్లంతా కలిసి ప్రమాదానికి కారణమైన లారీతో పాటు వెనుక వస్తున్న15 వాహనాలను అడ్డుకున్నారు. గుడ్ల మీది కోడిపెట్టను చంపినందుకు జరిమానా కట్టాల్సిందేనని పట్టుబట్టారు. ఈ ఘటన కుమ్రం భీం జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రంలో గురువారం ఉదయం జరిగింది. పోచమ్మ నుంచి బాబాసాగర్​పోయే దారిలో ఉండే దంద్రే బండయ్య కోళ్లను పెంచుతున్నాడు. ఇతడి దగ్గరున్న ఓ కోడిపెట్ట రోడ్డుపైకి వెళ్లగా అటుగా వెళ్తున్న ఒక కంకర టిప్పర్​ కోడిపై నుంచి వెళ్లింది. అది చనిపోగా ఓనర్​తో పాటు 100 మంది గ్రామస్తులు గుమిగూడి ప్రమాదానికి కారణమైన లారీని ఆపారు. రూ.500 తీసుకుని వదిలిపెట్టాలని టిప్పర్​ యజమాని కోరగా ఒప్పుకోలేదు.

తన కోడిపెట్ట ఇప్పటికే 10 గుడ్లు పెట్టిందని, అవి పిల్లలయితే తనకు ఎంతో లాభం వచ్చేదని కోడి ఓనర్​ బండయ్య వాదించాడు. ఈ క్రమంలో టిప్పర్​వెనక మరో 15 వాహనాలు ఆగిపోవడంతో ట్రాఫిక్​సమస్య తలెత్తింది. రెండు గంటల తర్వాత పోలీసులు అక్కడకు చేరుకుని టిప్పర్​యజమానితో మాట్లాడి కోడి ఓనర్​కు రూ.5 వేలు ఇప్పించారు. అలాగే కంకర టిప్పర్ల వల్ల కంకర, చిప్స్ పడి దుమ్ము వస్తోందని గ్రామస్థులనడంతో.. లారీ డ్రైవర్లు మనుషులను పెట్టి రోడ్లను క్లీన్​ చేయించారు.  తర్వాతే లారీలను  పోనిచ్చారు.