100 ఊర్లకు రాయల చెరువు టెన్షన్

100 ఊర్లకు రాయల చెరువు టెన్షన్

అమరావతి: ఏపీలోని చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలకు రాయల చెరువు పూర్తిగా నిండిపోయి ప్రమాదపు అంచుకు చేరింది. రామచంద్రాపురంలోని ఈ చెరువు కట్టకు చిన్న గండి పడి నీళ్లు లీక్ అవుతున్నాయి. కట్ట నుంచి కొద్దికొద్దిగా మట్టిగడ్డలు జారిపడుతున్నాయి. చెరువు తెగితే సుమారు వంద పల్లెలకు ముంపునకు గురవుతాయని ఆఫీసర్లు చెబుతున్నారు. చాలా మంది ప్రజలు ఎత్తయిన గుట్టలు, కొండల్లో తలదాచుకుంటున్నారు. ఆఫీసర్లు ఇప్పటికే దిగువ ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు. రాయల చెరువు మార్గంలో వాహన రాకపోకలు నిలిపివేశారు. మరో రెండు రోజులపాటు అప్రమత్తంగా ఉండాలని కోరారు. చెరువు కట్ట తెగితే సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ రెడీగా ఉన్నాయని తెలిపారు. మరోవైపు వచ్చే మూడు రోజులు రాయలసీమతోపాటు కోస్తాంధ్రలోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నదులకు వరద తగ్గకపోవడంతో పోటెత్తి ప్రవహిస్తున్నాయి. చాలా చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. రైల్వే లైన్ల కింద మట్టికొట్టుకుపోయింది.

కడపలో కూలిన బిల్డింగ్

కడప జిల్లాలో భారీ వర్షాలతో పాపాగ్ని నది ఉధృతికి కమలాపురం వంతెన కుంగిపోయింది. కడపలోని రాధాకృష్ణ నగర్‌‌‌‌లో ఆదివారం తెల్లవారుజామున మూడు అంతస్తుల భవనం కూలింది. కూలడానికి ముందు పెద్ద శబ్దం రావడంతో అందరూ అప్పటికే బయటికి వచ్చారు. శిథిలాల్లో చిక్కుకున్న ముగ్గురిని కాపాడారు. ఇక జిల్లాలో వరదల్లో చిక్కుకొని ఇప్పటిదాకా 26 మంది చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఆదివారం అనంతపురం జిల్లా బొమ్మనహళ్ మండలం శ్రీధరగట్ట గ్రామానికి చెందిన విరుపాక్షి (48) అనే రైతు మృతి చెందాడు. 15 ఏకరాల్లో సాగు చేసిన వరి పంట మొత్తం నాశనం కావడంతో గుండెపోటుకు గురై చనిపోయాడు. విజయనగరం జిల్లాలోని గజపతినగరం మండలం తుమ్మికాపల్లిలో చంపావతి నదిలో స్నానానికి వెళ్లిన ఇద్దరు విద్యార్థులు.. వరద ఉధృతికి గల్లంతయ్యారు.

వేల ఎకరాల్లో పంట నష్టం

ఇప్పటిదాకా కురిసిన కుండపోత వర్షాలకు ఏపీలో వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఎక్కువగా పత్తి, వరి పంటలు దెబ్బతిన్నాయి. అనంతపురం, చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో 170 మండలాల్లో వర్ష ప్రభావం భారీగా పడింది. ఈ నాలుగు జిల్లాల్లోనే 60 వేల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగింది. కోతకొచ్చిన వరి నీటిలో మునిగిపోగా.. పనలపైనే గింజలు మొలకెత్తాయి.