అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ లు కుంగే ప్రమాదం : మంత్రి ఉత్తమ్

అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ లు కుంగే ప్రమాదం : మంత్రి ఉత్తమ్

కాళేశ్వరం ప్రాజెక్టు కింద నిర్మించిన అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ప్రమాదంలో ఉన్నాయని సంచలన విషయాలు వెల్లడించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వందేళ్లు ఉండాల్సిన ఈ బ్యారేజీలు.. మూడేళ్లకే ప్రమాదంలో పడ్డాయని.. ఇదే విషయాన్ని NDSA.. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తన నివేదికలో వెల్లడించినట్లు అసెంబ్లీ సాక్షిగా సభలో ప్రకటించారు మంత్రి. కాళేశ్వరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసిన ప్రభుత్వం.. దానిపై చర్చలో ఈ విషయాలు వివరించారు.

అన్నారం ప్రాజెక్టులోనూ లీకులు మొదలయ్యాయని.. అధికారులు ఈ విషయాన్ని గుర్తించినట్లు స్పష్టం చేశారు. నిర్మాణ సమయంలో పర్యవేక్షణ లేదని.. నాణ్యత విషయంలో నిర్లక్ష్యం వహించటం వల్లే అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ప్రమాదంలో పడ్డాయని ప్రకటించారు మంత్రి ఉత్తమ్. 

బ్యారేజీలకు డీపీఆర్ లేకుండానే 25 వేల కోట్ల రూపాయల వరకు కాంట్రాక్టర్లకు చెల్లించారని.. వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని.. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ అవినీతి వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా మారిందని వెల్లడించారు మంత్రి ఉత్తమ్.