- హైదరాబాద్‌లోని అన్ని చెరువులూ కలుషితం
- పరిశ్రమలు, ఫార్మా వ్యర్థాలు నేరుగా చెరువుల్లోకి
- డేంజరస్ కెమికల్స్‌తో పడిపోయిన ఆక్సిజన్ స్థాయిలు
- మత్స్యశాఖ అధ్యయనంలో షాకింగ్ నిజాలు
- ఒక్క చెరువులోనూ చేపలను పెంచలేమని సర్కారుకు రిపోర్ట్
- గతంలో ఇబ్రహీంబాగ్ చెరువులో చేపల పెంపకం
- 440 ఏండ్ల చరిత్రగల ఆ చెరువు సైతం కాలుష్యపు కోరల్లోకి
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్నగర పరిధిలోని వందలాది చెరువుల్లో ఏ ఒక్క చెరువు కూడా చేపలు బతికేందుకు అనుకూలంగా లేదు. పారిశ్రామిక, మానవ వ్యర్థాల కారణంగా ఈ చెరువులన్నీ కాలుష్య కాసారాలుగా మారిపోయాయని, ఇవి చేపల పెంపకానికి (ఫిష్ కల్చర్‌కు) ఏమాత్రం పనికిరావని మత్స్యశాఖ స్టడీలో తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా 24వేల నీటి వనరుల్లో మత్స్యశాఖ ఏటా కోట్లాది చేప పిల్లలను విడుదల చేస్తున్నది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రెవెన్యూ రికార్డుల ప్రకారం 800కు పైగా చెరువులున్నాయి. వీటిలో మూడోవంతు చెరువులు కబ్జాలకు గురై రియల్ ఎస్టేట్ వెంచర్లుగా, తర్వాత ఆవాసాలుగా మారాయి. మిగతా చెరువుల్లో నేరుగా డ్రైనేజీ వ్యర్థాలు కలుస్తున్నాయి. కొన్ని చెరువులు ఏకంగా డంపింగ్యార్డులుగా మారిపోయాయి. హైదరాబాద్ చుట్టుపక్కల వందలాదిగా ఉన్న పరిశ్రమలు, ఫార్మా ఇండస్ట్రీస్ నుంచి శుద్ధి చేయకుండా విడుదలయ్యే పాదరసం, నికెల్, కాడ్మియం, ఆర్సెనిక్ వంటి ప్రమాదకర రసాయనాలు ఈ చెరువుల్లోకి చేరుతున్నాయి.
చేపలు బతకాలంటే నీటిలో డిసాల్వ్డ్ ఆక్సిజన్ కనీసం 4 పీపీఎం నుంచి 5పీపీఎం మధ్య ఉండాలి. కానీ ఈ చెరువుల్లో 2పీపీఎం కన్నా తక్కువగా ఉంది. అలాగే బయాలాజికల్ ఆక్సిజన్ డిమాండ్(బీఓడీ) స్థాయి లీటరుకు 3 మిల్లీగ్రాముల వరకు ఉండాల్సి ఉండగా గ్రేటర్ చెరువుల్లో 50మిల్లీ గ్రాముల వరకు ఉంటున్నది. ఇది మరీ ప్రమాదకరమని, అదే సమయంలో కార్బన్ డై ఆక్సైడ్, అమ్మోనియా వంటి హానికర వాయువులు పెరిగాయని, దీని వల్లే చేపలు మరణిస్తున్నాయని మత్స్యశాఖ అధ్యయనంలో తేలింది.
హైదరాబాద్‌తో పాటు ఇండస్ట్రీస్ ప్రభావం ఎక్కువగా ఉండే సంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని అన్ని చెరువుల్లోనూ విషరసాయనాల ప్రభావం ఉంటోందని మత్స్యశాఖ గుర్తించింది. ఈ జిల్లాల్లోనూ పీసీబీ క్లియెరెన్స్ ఇచ్చిన చెరువుల్లోనే చేపలను విడుదల చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
కాలుష్యపు కోరల్లోకి ఇబ్రహీంబాగ్ చెరువు..
హైదరాబాద్‌లో 440 ఏండ్ల చరిత్ర కలిగిన ఇబ్రహీంబాగ్ పెద్ద చెరువు 70 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో చేపల పెంపకానికి ఏకైక ఆసరాగా నిలిచిన ఆ చెరువు కూడా ఇప్పుడు కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. మత్స్యశాఖ కొన్నాళ్ల కింద వరకు ఏటా 60 వేల చేప పిల్లలను వదిలేది. కానీ ఇప్పుడు అది కూడా కాలగర్భంలో కలసిపోయే పరిస్థితి నెలకొంది.
ఇబ్రహీంబాగ్ పెద్ద చెరువులోనే రోజూ 10 వేల లీటర్లకు పైగా కెమికల్స్ డంపింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా మణికొండ, పుప్పాలగూడ, అల్కాపూర్, ఓయూ కాలనీల నుంచి వచ్చే మురుగునీరు చేరుతూ చెరువు నీరంతా కలుషితమైంది. దుర్వాసనతో పాటు గాలిలో కెమికల్స్ కలవడంతో స్థానికులకు శ్వాసకోశ సమస్యలు పెరిగాయి. దోమల బెడదతో పిల్లలు డెంగ్యూ, ఇతర విష జ్వరాలతో ఆస్పత్రుల పాలవుతున్నారు. డిసాల్వ్డ్ ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో తమ ఆరోగ్యాలు పాడవుతున్నాయని చుట్టుపక్కల కాలనీల జనం వాపోతున్నారు.
చేపలు బతికే చెరువు ఒక్కటీ లేదు..
“30 ఏండ్లుగా హైదరాబాద్ చెరువుల్లో చేప పిల్లలు వదలడం లేదు. ఇప్పుడు ఇబ్రహీంబాగ్ చెరువు కూడా ఆ జాబితాలో చేరిపోయింది” అని మత్స్యశాఖకు చెందిన ఓ అధికారి ‘వెలుగు’తో పేర్కొన్నారు. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ వంటి పెద్ద జలాశయాల్లో మంచి నీరున్నా చేపల పెంపకంపై నిషేధం ఉందని, దీంతో నేడు హైదరాబాద్‌లో చేపలు బతికే ఒక్క చెరువు కూడా మిగల్లేదన్నారు. చెరువుల్లో ప్రమాదకర పాదరసం, కాడ్మియం, ఆర్సెనిక్ వంటి విషరసాయనాలు చేయడంతో చేపలు బతకడం లేదని చెప్పారు.
ఎస్టీపీ ప్లాంట్లు ఏర్పాటుచేస్తేనే..
చెరువులు జీవావరణంలో కీలకపాత్ర పోషిస్తాయని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. సర్కారు వెంటనే రంగంలోకి దిగి,యుద్ధప్రాతిపదికన అన్ని చెరువుల చుట్టూ ఎస్టీపీ ప్లాంట్లు ఏర్పాటుచేసి, శుద్ధిచేసిన నీరే చెరువుల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అప్పుడే ఒకప్పుడు చేపలతో కిటకిటలాడిన ఇబ్రహీంబాగ్ లాంటి చెరువులకు పూర్వవైభవం సాధ్యమని చెప్తున్నారు. లేదంటే హైదరాబాద్‌లో కబ్జాలకు గురికాగా, మిగిలిన చెరువులు సైతం శాశ్వతంగా కనుమరుగవుతాయని హెచ్చరిస్తున్నారు.
