US Open 2025: తొలి రౌండ్‌లోనే ఓడిన మాజీ ఛాంపియన్.. కోపంతో రాకెట్ విరగ్గొట్టిన మెద్వెదేవ్

US Open 2025: తొలి రౌండ్‌లోనే ఓడిన మాజీ ఛాంపియన్.. కోపంతో రాకెట్ విరగ్గొట్టిన మెద్వెదేవ్

రష్యన్ టెన్నిస్ ఆటగాడు డేనియల్ మెద్వెదేవ్ కు టెన్నిస్ లో కష్టకాలం కొనసాగుతోంది. ఏడాదికాలంగా గ్రాండ్ స్లామ్స్ టోర్నీల్లో దారుణంగా విఫలమవుతున్న ఈ రష్యన్ స్టార్ ఆటగాడికి యూఎస్ ఓపెన్‌లో బిగ్ షాక్ తగిలింది. తొలి రౌండ్‌లోనే ఓడిపోయి ఇంటిదారి పట్టాడు. భారత కాలమాన ప్రకారం సోమవారం (ఆగస్టు 25) ఫ్రాన్స్‌ ప్లేయర్ బెంజమిన్ బోంజీ చేతిలో ఐదు సెట్ల థ్రిల్లర్‌లో ఓడిపోయాడు.
3 గంటల 45 నిమిషాల పాటు సాగిన ఈ బ్లాక్ బస్టర్ పోరులో 6-3, 7-5, 6-7(5), 0-6, 6-4తో  మెద్వెదేవ్ పై బోంజీ విజయం సాధించాడు.

మెద్వెదేవ్ ఈ ఏడాది జరిగిన గ్రాండ్ స్లామ్స్ లో తొలి రౌండ్ లో ఓడిపోవడం వరుసగా ఇది మూడోసారి.  అంతకముందు ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ లోనూ తొలి రౌండ్ లోనే నిష్క్రమించాడు. సీజన్ తొలి గ్రాండ్ స్లామ్ లో తొలి రౌండ్ లో గెలిచినా రెండో రౌండ్ లో ఇంటిదారి పట్టాడు. 2021లో యూఎస్ ఓపెన్‌ ఛాంపియన్ గా నిలిచిన ఈ రష్యన్ స్టార్ ఆ తర్వాత మాత్రం ఆ జోరును కొనసాగించలేకపోయాడు. తొలి రెండు సెట్స్ ఓడిపోయిన తర్వాత సహనాన్ని కోల్పోయిన మెద్వెదేవ్ తన రాకెట్ విరగొట్టాడు. 

►ALSO READ | Team India: బీసీసీఐతో చేతులు కలపనున్న కొత్త కంపెనీ.. టీమిండియాకు స్పాన్సర్‌ దొరికేసినట్టే

మొదటి రెండు సెట్‌లను 3-6, 5-7 తేడాతో కోల్పోయినా మూడు, నాలుగు సెట్ లను గెలిచి కంబ్యాక్ ఇచ్చాడు. మ్యాచ్ పాయింట్‌ను సేవ్ చేసి టైబ్రేకర్ లో మూడో సెట్ గెలవడం విశేషం. నిర్ణయాత్మకమైన ఐదో సెట్ లో మాత్రం ఆధిక్యంలో ఉండి కూడా మ్యాచ్ చేజార్చుకున్నాడు. నాలుగు సార్లు ఛాంపియన్, 24 గ్రాండ్ స్లామ్స్ ఛాంపియన్ నోవాక్ జొకోవిచ్ తొలి రౌండ్ ను అలవోకగా అధిగమించాడు. 6-1,7-6,6-2 తో టీన్ పై విజయం సాధించాడు.