వరంగల్ జిల్లా నర్సంపేట రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో తీవ్ర విషాదం నెలకొంది. విధి నిర్వహణలో ఉన్న ఓ ప్రభుత్వ ఉద్యోగి గుండెపోటుతో అకస్మాత్తుగా కన్నుమూశారు.
నర్సంపేట ఆర్డిఓ కార్యాలయంలో డిఏఓ (DAO)గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ రావుకు, సోమవారం పనిలో ఉండగానే ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. ఆయన అస్వస్థతకు గురవ్వడాన్ని గమనించిన తోటి సిబ్బంది వెంటనే అప్రమత్తమై అంబులెన్స్‌కు సమాచారం అందించారు.
శ్రీనివాస్ రావును ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో అంబులెన్స్ సిబ్బంది ఆయన ప్రాణాలను కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అంబులెన్స్‌లోనే ఆయనకు సిపిఆర్ (CPR) నిర్వహించినప్పటికీ ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమించడంతో వెంటనే ఆయనను వరంగల్‌లోని అజరా ఆసుపత్రికి తరలించారు.
అయితే, శ్రీనివాస్ రావును పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. విధి నిర్వహణలో ఉంటూ ఇలా అకస్మాత్తుగా మరణించడంతో నర్సంపేట ఆర్డిఓ కార్యాలయంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తోటి ఉద్యోగులు ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
