హైదరాబాద్, వెలుగు : ఆర్టీసీలో లేడీ కండక్టర్లకు ఇంతకుముందు ఇవ్వాలనుకున్న మెరూన్ కలర్ యాప్రాన్‌కు బదులు డార్క్ బ్లూ కలర్ యాప్రాన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. డిసెంబర్ ఒకటో తేదీన సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా ఖాకి కలర్ డ్రెస్ కోడ్ మార్చుకోవాలని సూచించారు. ఆర్టీసీ అధికారి సుధ నేతృత్వంలో ఓ కమిటీ కూడా వేశారు. ప్రతి డిపో నుంచి ఇద్దరు లేడీ కండక్టర్లను కమిటీలో చేర్చుకుని అభిప్రాయాలు తీసుకున్నారు. చివరికి చీర కాకుండా మెరూన్ కలర్ యాప్రాన్ వేసుకోవాలని నిర్ణయించారు. ఇక ఉత్తర్వులు రావడం ఒక్కటే మిగిలి ఉండగా ఆ కలర్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మెరూన్చూడటానికి బాగుండనదే వాదనలు వినిపించాయి. దీంతో కమిటీ ఇటీవల మరోసారి సమావేశమై చర్చించింది. చివరగా డార్క్‌బ్లూ అయితే బాగుంటుందని అభిప్రాయపడినట్లు తెలిసింది. ఇదే ఫైనల్ చేయనున్నట్లు సమాచారం. లేడీ కండక్టర్లకు మొత్తం 9వేల మీటర్ల క్లాత్అవసరం పడనుండగా, రెండు యాప్రాన్లతో పాటు లేసుల్లేని షూ జత ఇవ్వనున్నారు. త్వరలో హైదరాబాద్‌లో జరగనున్న ఆర్టీసీ వనభోజనాల కార్యక్రమంలో డార్క్ బ్లూ యాప్రాన్‌ను ప్రదర్శించనున్నారు.
‘గ్రేటర్’ కండక్టర్లు, డ్రైవర్లకు బదిలీ చాన్స్!
గ్రేటర్ హైదరాబాద్ జోన్ కండక్టర్లు, డ్రైవర్లకు బదిలీ అవకాశాన్ని ఆర్టీసీ కల్పించనుంది. సిటీలో వెయ్యి బస్సుల్ని రద్దు చేసిన నేపథ్యంలో సుమారు 4 వేల మంది డ్రైవర్లు, కండక్టర్లు ఖాళీగా ఉన్నట్టు అంచనా. ఈ సిబ్బందిని గ్రామీణ ప్రాంతాలకు బదిలీ చేసుకునే అవకాశాన్ని ఆర్టీసీ కల్పిస్తోంది. ఉద్యోగం కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్‌లోని డిపోల్లో డ్యూటీ చేస్తున్న వారికి ఈ చాన్స్ ఇవ్వాలని యోచిస్తున్నారు. ఈ మేరకు ఆసక్తి ఉన్న వారు డిపో మేనేజర్లకు దరఖాస్తు పెట్టుకోవాలని మేనేజ్మెంట్ సూచించింది. ఆ దరఖాస్తులను పరిశీలించాక నిర్ణయం ప్రకటిస్తామని ఆర్టీసీ పేర్కొంది. ఈ మేరకు డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసింది.
