ఔటర్ పై చీకట్లు..కిలోమీటర్ల మేర వెలగని లైట్లు

ఔటర్ పై చీకట్లు..కిలోమీటర్ల మేర వెలగని లైట్లు
  •      రాత్రివేళల్లో యాక్సిడెంట్లు
  •     కొంతకాలంగా ఇదే ప్రాబ్లమ్
  •     మెయింటెనెన్స్ ను చూడని  ఐఆర్ బీ సంస్థ
  •     వాహనదారులకు ఇబ్బందులు తప్పట్లే

హైదరాబాద్, వెలుగు: ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) పై చీకట్లు కమ్మేశాయి. లైట్ల మెయింటెనెన్స్ సక్కగ లేదు. నిర్వహణను ఏజెన్సీ సంస్థ ఐఆర్ బీ సరిగా చూస్తలేదు. ఆ సంస్థ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నా కూడా అధికారులు పట్టించుకోవడంలేదు. ఔటర్ పైన కొన్ని కిలోమీటర్ల వరకు లైట్లు వెలగని సమస్య ఉంది. ఔటర్ నిర్వహణ బాధ్యతలు ఐఆర్ బీకి  ఇచ్చినప్పటి నుంచే సక్రమంగా చేయడంలేదనే విమర్శలు వస్తున్నాయి. మొత్తం ఔటర్ 158 కిలోమీటర్లు. ఇందులో పదుల కిలోమీటర్లలో రోజూ లైట్లు వెలగడంలేదు.

దీంతో వాహనదారులకు ఇబ్బందులు వస్తున్నాయి. ఔటర్ పై వాహనాల వేగం 100 నుంచి120  పెంచుతూ గత సర్కార్ నిర్ణయం తీసుకుంది. అప్పటినుంచి లైటింగ్ లేకపోగా కొన్నిచోట్ల 80 స్పీడ్ కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. సంస్థపై ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలప్పుడు  తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అందుకు అనుగుణంగానే ఔటర్ లీజుపై విచారణకు కూడా తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇప్పటికే పలువురు మంత్రులు ప్రకటించారు. సంస్థ నిర్వహణ చేపట్టిన తొలినాళ్లలో ఔటర్ రోడ్లు కూడా పూర్తిగా ధ్వంసం అయ్యాయి.

అప్పట్లో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాక మరమ్మతులు చేశారు. ఔటర్ పైన పరిస్థితి ఇలా ఉంటే సర్వీసు రోడ్లపై మరీ దారుణంగా ఉంది. కొన్నిచోట్ల లైట్లు ఏర్పాటు చేయలేదు. కొన్నిచోట్ల ఉన్నా వెలగడంలేదు. సర్వీసు రోడ్ల నిర్వహణను పట్టించుకోవడంలేదు. 

టీవోటీ పద్ధతిలో లీజుకివ్వగా..

గతేడాది జులై వరకు ఔటర్ మెయింటెనెన్స్ ను హెచ్ఎండీఏ చూసేది.  టోల్ వసూలు ఈగల్ ఇన్ ఫ్రా సంస్థకు అప్పగించింది. అనంతరం   టోల్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ ఫర్(టీవోటీ) పద్ధతిలో లీజుకిచ్చినది తెలిసిందే. ఐఆర్ బీ ఇన్ ఫ్రాస్ర్టక్చర్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు  రూ.7,380 కోట్లకు 30 ఏళ్ల పాటు టీవోటీ కింద గత బీఆర్ఎస్ సర్కార్ కట్టబెట్టింది. సర్వీసు రోడ్డు నిర్వహణ బాధ్యతను కూడా సంస్థనే చూసుకోవాలి.

అయితే.. సంస్థ పెద్దగా పట్టించుకోవడంలేదు. దీంతో టోల్ చెల్లిస్తున్న వాహనదారులకు ఇబ్బందులు తప్పడంలేదు.  సోషల్ మీడియాలోనూ జనం మండిపడుతున్నారు. ఔటర్ పై కనీసం లైటింగ్ కూడా ఉండడంలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాత్రి వేళల్లో  నిత్యం యాక్సిండెంట్లు అవుతున్నాయి. కొద్ది దూరం లైటింగ్ ఉండి, ఇంకొద్ది దూరం లేకపోయే సరికి డ్రైవర్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు.  ఇలాంటి సమయాల్లోనే యాక్సిడెంట్లు అవుతున్నాయి.  

యాక్సిడెంట్లకు చెక్ పెట్టేందుకే ఏర్పాటు 

ఔటర్ పై యాక్సిడెంట్లను తగ్గించేందుకే  2018లో కొన్నిచోట్ల  లైట్లను ఏర్పాటు చేశారు. హెచ్ఎండీఏ, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 2021లో మిగతా చోట్ల  లైట్లను అమర్చారు. జంక్షన్, అండర్ పాస్, రెండు వైపుల సర్వీస్ రోడ్లను ఒక కిలోమీటర్ మేర లైట్లు వెలుగుతాయి. గచ్చిబౌలి – శంషాబాద్ మధ్య 22 కిలోమీటర్లు రూ.30 కోట్లతో 2018లోనే  లైటింగ్ ఏర్పాటు చేశారు.ఆ తర్వాత 2021లో రూ.100.22 కోట్లతో  6 ,340 పోల్స్ కు 13, 392 ఎల్ఈడీ లైట్లను అమర్చారు. ఔటర్‌‌పై ఎల్‌‌ఈడీ లైట్లను పూర్తిగా గ్లోబల్‌‌ సిస్టమ్‌‌ మొబైల్‌‌ (జీఎస్ఎం) బేస్డ్‌‌ ఆటోమేషన్‌‌ రిమోట్‌‌ పద్ధతిన ఏర్పాటు చేశారు.

విద్యుత్‌‌ ఆదాతో పాటు బల్బ్ లు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయని అలాంటి సిస్టంను అమర్చారు.  ఔటర్‌‌ అప్‌‌ అండ్‌‌ డౌన్‌‌ ర్యాంప్‌‌లు, పలు జాతీయ, రాష్ట్రీయ రహదారుల అనుసంధానమైన ప్రాంతాల్లో కూడా ఎల్‌‌ఈడీ బల్బులు పెట్టారు.  ప్రస్తుతం వీటి నిర్వహణ సరిగా లేదు. దీంతో లైట్లు వెలగడంలేదు. ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు ఏర్పాటు చేసిన లైట్లు వెలగకపోవడంతో మరిన్ని ప్రమాదాలకు కారణమైతుంది.