IND vs NZ: టీమిండియాకు ఛేజింగ్ టెన్షన్.. మిచెల్, ఫిలిప్స్ సెంచరీలతో న్యూజిలాండ్ భారీ స్కోర్

IND vs NZ: టీమిండియాకు ఛేజింగ్ టెన్షన్.. మిచెల్, ఫిలిప్స్ సెంచరీలతో న్యూజిలాండ్ భారీ స్కోర్

న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా బౌలర్లు విఫలమయ్యారు. పవర్ ప్లే లో బాగా రాణించినా ఆ తర్వాత పూర్తిగా తేలిపోయారు. ఆదివారం (జనవరి 18) ఇండోర్ వేదికగా హోల్కర్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టీమిండియా ముందు ప్రత్యర్థి న్యూజిలాండ్ భారీ స్కోర్ సెట్ చేసింది. సూపర్ ఫామ్ లో డారిల్ మిచెల్ (137) సెంచరీతో చెలరేగగా.. గ్లెన్ ఫిలిప్స్ (106) కూడా శతకం బాదడంతో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. మిచెల్ 137 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇండియా బౌలర్లలో అర్షదీప్ సింగ్, హర్షిత్ రానా తలో మూడు వికెట్లు పడగొట్టారు. సిరాజ్, కుల్దీప్ తలో వికెట్ తీసుకున్నారు. 

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ ఊహించని ఆరంభం లభించింది. ఆ జట్టు 5 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. తొలి ఓవర్లో అర్షదీప్ సింగ్ నికోల్స్ (0) క్లీన్ బౌల్డ్ చేస్తే.. రెండో ఓవర్లో హర్షిత్ రానా.. కాన్వే (5)ను పెవిలియన్ కు పంపాడు. భారత పేసర్లు విజృంభించడంతో 5 పరుగులకే న్యూజిలాండ్ రెండు వికెట్ల కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో బ్యాటింగ్ కు దిగిన డారిల్ మిచెల్ జట్టును ముందుండి నడిపించాడు. మూడో వికెట్ కు విల్ యంగ్ తో కలిసి 53 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 30 పరుగు చేసి క్రీజ్ లో సెట్ అయిన విల్ యంగ్ ను రానా ఔట్ చేయడంతో 58 పరుగుల వద్ద న్యూజిలాండ్ మూడో వికెట్ కోల్పోయింది. 

ఆ తర్వాత గ్లెన్ ఫిలిప్స్ తో కలిసి మిచెల్ టీమిండియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. వీరిద్దరూ చాలా ఈజీగా టీమిండియా బౌలర్లను ఆడేశారు. ఓ వైపు మిచెల్, మరోవైపు ఫిలిప్స్ మొదట సింగిల్స్ తో స్ట్రైక్ రొటేట్ చేసినా క్రమంగా బౌండరీల వర్షం కురిపించారు. ఈ క్రమంలో మిచెల్ హాఫ్ సెంచరీతో పాటు సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఆ తర్వాత మిచెల్ కూడా సెంచరీ చేసి సత్తా చాటాడు. వీరి జోడీ నాలుగో వికెట్ కు ఏకంగా 219 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు భారీ అందించారు. స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ ఔటైనా చివర్లో కెప్టెన్ బ్రేస్ వెల్ (28) వేగంగా ఆడి జట్టు స్కోర్ ను 330 పరుగులు దాటించాడు.