
విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ, దర్శకనిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. నివేదా పేతురాజ్ హీరోయిన్. ఉగాది సందర్భంగా విడుదలైన ఈ మూవీకి ప్రేక్షకుల నుండి లభిస్తున్న రెస్పాన్స్ గురించి విశ్వక్ మాట్లాడుతూ ‘ ఈ సినిమా మేము అనుకున్నదాని కంటే పెద్ద సక్సెస్ అయ్యింది. నా కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఫస్ట్ రోజే 8 కోట్ల 88 లక్షల రెవెన్యూ వచ్చింది. నిజానికి కామెడీ నా బలం కాదు. యాక్షన్ డ్రామా, ఇంటెన్స్ ఎమోషన్స్ బాగా డైరెక్ట్ చేస్తా. అయితే ఈ సినిమాతో కామెడీ కూడా బాగా తీయగలననే నమ్మకాన్ని ఇచ్చారు ప్రేక్షకులు. ఫస్ట్ హాఫ్‌ని హిలేరియస్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. నేను చేసిన డ్యూయెల్ కూడా బాగా సక్సెస్ అయ్యింది.
హీరోగా, డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా రిస్క్ చేసి మరీ సినిమా తీశాను కాబట్టి.. రిజల్ట్ మజాగా ఉంది. సినిమా తీస్తున్నప్పుడు కష్టమనిపించలేదు..కానీ విడుదల సమయంలోనే ప్రెజర్ ఫీలయ్యా. మలయాళం, హిందీ భాషల్లో విడుదలకు రెడీగా ఉన్నాం. హిందీలో ఏప్రిల్ 14న రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ప్రస్తుతం సితార బ్యానర్‌లో ఓ సినిమా, రామ్ తాళ్లూరి నిర్మాణంలో మరో మూవీలో నటిస్తున్నా. వీటి తర్వాత నా సొంత ప్రొడక్షన్‌లో మరో సినిమా ఉంటుంది. ‘గామి’ విడుదలకు రెడీగా ఉంది. అలాగే ఫలక్‌నుమా దాస్2, ధమ్కీ2 కూడా ప్లానింగ్‌లో ఉన్నాయి’ అని చెప్పాడు.