Dasara 2025 : జమ్మి పూజ... పాలపిట్టకు ఉన్న అనుబంధం ఏంటీ.. ఏ స్తోత్రం చదువుతూ జమ్మి పూజ చేయాలి..?

Dasara 2025 : జమ్మి పూజ... పాలపిట్టకు ఉన్న అనుబంధం ఏంటీ.. ఏ స్తోత్రం చదువుతూ జమ్మి పూజ చేయాలి..?

దసరా పండుగ గురించి పురాణాల్లో విశేషంగా చెప్పారు.  హిందువులు ఈ పండుగను ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు.  రామాయణం.. మహాభారత గ్రంధాల్లో కూడా ఈ పండుగ  ప్రాధాన్యత.. విశిష్టత గురించి చెప్పారు.  దసరా పండుగ రోజున పాండవులు పాల పిట్టను చూడటం.. రాముడు యుద్దంలో విజయం సాధించిన రోజుని   భక్తిశ్రద్దలతో జరుపుకుంటారు. . దసరా రోజు భక్తి శ్రద్ధలతో పండుగను జరుపుకుంటే మంచి జరుగుతుందని ప్రజలు నమ్ముతారు

మహాభారతంలో కూడా విజయదశమి పండుగకు నేపథ్యం ఉంది. పాండవులు. రాజ్యాన్ని విడిచి అరణ్యవాసంలోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిన రోజు.. వాళ్లకు సంబంధించిన ఆయుధాలన్నింటినీ ఒక మూట కట్టి, తిరిగొచ్చే వరకూ వాటిని చూసుకోమని జమ్మి చెట్టుకి కడతారు. అరణ్యవాసం పూర్తయ్యాక వాళ్లు ఆశ్వయుజ మాసంలోని దశమి రోజునే తిరిగొచ్చి తమ ఆయుధాలను తీసుకుంటారు. ఆ తర్వాత కౌరవులపై యుద్ధం చేసి తిరిగి తమ రాజ్యాన్ని పాండవులు దక్కించుకున్న విషయం తెలిసిందే. వాళ్ళు దశమి రోజున జమ్మి చెట్టుకు తిరిగొచ్చినందునే దసరా పండుగను జరుపుకోవడంతో పాటు, ఆ రోజే ప్రత్యేకంగా జమ్మి చెట్టుకి పూజలు చేస్తారు. అదే రోజు పాండవులు జమ్మిచెట్టుపై ఒక పాల పిట్టను చూశారు. అందుకే దసరా రోజున పాలపిట్టను చూసి, జమ్మి చెట్టుకు మొక్కితే మంచి జరుగుతుందని నమ్ముతారు. ఆయుధపూజను కూడా ఈ కారణం వల్లనే చేస్తారు.

జమ్మి చెట్టును పూజిస్తూ ఈ స్తోత్రం చదవాలి

శమీ శమయతే పాపం 
శమీ శత్రువినాశినీ 
అర్జునస్య ధనుర్ధారీ
రామస్య ప్రియదర్శినీ!! 


కరిష్యమాణ యాత్రాయా యథాకాలమ్ సుఖం మయా తత్ర నిర్విఘ్న కల్తీత్వం భవ శ్రీరామ పూజితా!!

అలయ్ బలయ్.. మన స్టైల్​..

జమ్మి చెట్టుకు మొక్కుకున్న తర్వాత జమ్మి ఆకులను తీసి పట్టుకొని, బంధువులకు, స్నేహితులకు ఇవ్వడం అన్నది సంప్రదాయం. 'జమ్మి చెట్టుని ఈ రోజున ఎంత ప్రత్యేకంగా చూస్తారంటే, జమ్మి ఆకులను 'బంగారం' అని పిలుచుకుంటారు. ఇందులోనే అలయ్ బలయ్ అన్న మంచి ఆలోచన ఉంది. ఆలయ్ ఐలయ్ అన్నది ఇతరులతో సోదరభావాన్ని కలిగించేది. జమ్మి ఆకు అంటే బంగారాన్ని చేతిలో పెట్టి అవతలివాళ్లను కౌగిలించుకోవడమే ఆలయ్ బలయ్.
మగవాళ్లు ఆడబిడ్డల కాళ్లకు దండం పెట్టి జమ్మి ఆకులని చేతికిస్తారు. నాన్నమ్మలు, అమ్మమ్మలు, మేనత్తలు, అమ్మలు, చిన్నమ్మలే కాదు... చెల్లెళ్లయినా, అక్కలైనా, వదినలైనా... వాళ్ల కాళ్లు మొక్కుతారు. ఇలాంటి సంప్రదాయం ఒక్క తెలంగాణాలోనే ఉంది.

రామనామమూ ఈ రోజే

దసరాకు రామాయణ నేపథ్యంలో కూడా ఒక పురాణ కథ ఉంది. శ్రీరాముడు లంకలో రావణుడ్ని చంపిన రోజు దశమే. రాముడంటే దేవుడు... రావణుడు రాక్షసుడు. చెడుపై మంచి గెలవడం ఈ కథలో ఉంది. దసరా రోజున రామాలయాలు కూడా రామనామంతో సందడిగా ఉంటాయి. తెలంగాణలోని పెద్ద మైదానాల్లో రావణుడి దహన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. అంతెత్తున పది తలల రావణుడి బొమ్మను చేసి, ఆ బొమ్మను బాణాసంచా కాలుస్తారు. ఇది చాలా ప్రాంతాల్లో ఒక పెద్ద సంబరంలానే ఉంటుంది. దసరా తర్వాత ఇరవై ఒక్క రోజులకు  దీపావళి వస్తుంది. రావణుడ్ని చంపిన తర్వాత రాముడు తన పరివారంతో అయోధ్యను చేరింది ఆశ్వయుజ మాసం దశమి రోజే.

ఆయుధపూజ

కులవృత్తులు చేసేవాళ్ల దగ్గర్నుంచి, ప్రతి ఒక్కరికీ ఏదో ఒక ఆయుధం ఉంటుంది. ఆ ఆయుధమే వాళ్లకు జీవితాన్నిస్తుంది. పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీది నుంచి తీసిన రోజు దసరానే. అందుకే ఈ రోజున ఎవ్వరికి వాళ్లు తమ ఆయుధాలకు ఆయుధ పూజ చేయిస్తారు. ఆ ఆయుధం అన్నది బండి కావొచ్చు, మెషీన్ కావొచ్చు, రైతులకైతే నాగలి, కొడవలి కావొచ్చు, పిల్లలకు చదువుకునే పుస్తకాలు కూడా కావొచ్చు. ఆయుధ పూజ చేయించడం ద్వారా విజయం మనవైపే ఉంటుందన్నది భక్తుల విశ్వాసం.