
దసరా నవరాత్రి ఉత్సవాల్లో ఐదోరోజున (సెప్టెంబర్26) అమ్మవారు శ్రీమహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి మూడు శక్తుల్లో ఒక శక్తి అయిన శ్రీ మహాలక్ష్మీ అమ్మ వారు అమితమైన పరాక్రమంతో .... డోలాసురుడనే రాక్షసుడిని సంహరించి సమస్త లోకాలకు శాంతి చేకూర్చిందని పురాణ వచనం.
లోకస్థితికారిణిగా... ధన... ధాన్య... ధైర్య... విజయ.... విద్య.... సౌభాగ్య.... సంతాన.. గజ లక్ష్మీలుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మీ సమష్టిరూపమైన అమృత స్వరూపిణిగా... శ్రీ దుర్గమ్మ మహాలక్ష్మీ దేవిని నవరాత్రి ఉత్సవాల్లో ఐదో రోజున పూజిస్తారు. చాలా దేవాలయాల్లో మహాలక్ష్మి దేవికి కుంకుమార్చన చేస్తారు. శ్రీ మహా లక్ష్మీ స్వరూపంలో అమ్మవారిని.. పూజించడం.. దర్శించటం వల్ల భక్తులందరికీ ఐశ్వర్యప్రాప్తి, విజయం లభిస్తుంది.
ప్రతి ఒక్కరు అన్ని విధాలుగా సౌఖ్యంగా జీవించేందుకు ఆ తల్లి అనుగ్రహం అవసరం. ఈ విషయంలో మహిళలే కీలకపాత్ర పోషిస్తారు. మహిళలే దేవి స్వరూపంగా నిలుస్తారు. ప్రతి విషయంలో అంటే కష్టాల్లో.. నష్టాల్లో భర్తకు ధైర్యం చెబుతూ ధైర్యలక్ష్మిగా.. భర్త సాధించే విజయాలకు మూలకారణంగా ఉంటూ విజయలక్ష్మిగా... బిడ్డలకు జ్ఞానాన్ని బోధిస్తూ విద్యాలక్ష్మిగా... కుటుంబం పేరు నిలిపేలా సంతానాన్ని తీర్చిదిద్దుతూ సంతానలక్ష్మిగా....ఇంటిల్లిపాదికీ భోజనం పెడుతూ ధాన్యలక్ష్మిగా... ఇలా అన్ని రూపాల్లో తానే అయి సంసారాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యతను మహిళలకు లక్ష్మీదేవి అలంకారాలు గుర్తు చేస్తాయి.
మహాలక్ష్మీ దేవి ఐశ్వర్యానికి, సంపద, శాంతి, శుభాలకు ప్రతీక. ఈమె సకల సంపదలు ప్రసాదిస్తుందని నమ్మకం. ఆర్థికంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా అభివృద్ధి చెందుతారని విశ్వాసం. మహాలక్ష్మీ దేవికి గారెలు నైవేద్యంగా సమర్పించడం ఒక సంప్రదాయంగా ఉంది. అలాగే క్షీరాన్నం, పాయసం, పులిహోర వంటివి కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.