హైదరాబాద్, వెలుగు: ఒక బీహార్ వ్యక్తి, మరో కర్నాటక వ్యక్తి వచ్చి తెలంగాణలో రాజకీయం చేస్తే కేసీఆర్ గెలుస్తడా? ఆయన ఎన్ని కుప్పిగంతులు వేసినా వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్అన్నారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రశాంత్ కిశోర్, ప్రకాశ్‌రాజ్‌లు వచ్చి ఇక్కడ రాజకీయం చేయాలని చూస్తే ప్రయోజనం లేదన్నారు. ప్రజల రక్తమాంసాలను దోచుకొని కేసీఆర్ రూ.500 కోట్లు పెట్టి ప్రశాంత్ కిశోర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. పీకే రాజకీయ వ్యభిచారి అని, ఆయన ఎప్పుడు ఏ పార్టీతో పని చేస్తారో తెలియదన్నారు. ప్రకాశ్ రాజ్ మంచి నాయకుడని, ఆయన కేసీఆర్‌తో కాకుండా తెలంగాణ నిరుద్యోగులతో కలిసి పని చేయాలన్నారు. అట్లా కాకుండా తెలంగాణలో ప్రజాస్వామ్య విలువలను పాతర వేసిన కేసీఆర్పక్కన నిలబడటం సిగ్గు చేటన్నారు. కేసీఆర్ శీర్షాసనం వేసినా ఈసారి గెలవడని ఆయన అన్నారు.
