కోటి మంది బీసీ కార్యకర్తల సభ్యత్వ నమోదే లక్ష్యం : బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్   

కోటి మంది బీసీ కార్యకర్తల సభ్యత్వ నమోదే లక్ష్యం : బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్   
  • మెంబర్​షిప్  కార్యక్రమం షురూ 
  • బీసీల రాజ్యాధికారానికి ఈ డ్రైవ్  సాయపడుతుంది: మధుసూదనాచారి

హైదరాబాద్​సిటీ, వెలుగు: కోటి మంది బీసీ కార్యకర్తల సభ్యత్వ నమోదే తమ లక్ష్యమని, వచ్చే నెల చివరిలోపు పది లక్షల మంది సభ్యత్వాలు చేయిస్తామని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్  అన్నారు. శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, రిటైర్డ్​ ఐఏఎస్ చిరంజీవులు, బీసీ కమీషన్  మాజీ చైర్మన్  వకుళాభరణం కృష్ణమోహన్ తో కలిసి సురేశ్  ఆదివారం హైదరాబాద్  సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా సురేశ్  మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీల సమైక్యత, సంఘటిత శక్తిని పెంపొందించేందుకు బీసీల కోటి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. గ్రామ, వార్డు, మండల, బస్తీ పట్టణ, నియోజకవర్గ, జిల్లాలా వారీగా సభ్యత్వాల నమోదు కొనసాగుతుందన్నారు. తర్వాత గ్రామ పంచాయతీలు , మండలాలు, నియోజకవర్గాల వారీగా కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. 15 ఏండ్లు పైబడిన ప్రతిఒక్కరూ తమ సభ్యత్వాన్ని నమోదు చేయించుకోవచ్చని, ఆన్​లైన్​ లోనూ మెంబర్ ​కావొచ్చన్నారు.

క్రియాశీలక నాయకులకు ఇన్సూరెన్స్  సదుపాయాన్ని కల్పిస్తామన్నారు. శాసనమండలి ప్రతిపక్ష నేత  మధుసూదనాచారి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు కావడానికి ఈ సభ్యత్వ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. బీసీ ఇంటెలెక్చువల్  ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్  చిరంజీవులు మాట్లాడుతూ కోటి బీసీ లీడర్ల సభ్యత్వ నమోదు యుద్ధ ప్రాతిపదికన  విజయవంతం చేయడానికి ప్రతి బీసీ కృషి చేయాలన్నారు.

బీసీ కమిషన్  చైర్మన్  వకుళాభరణం  కృష్ణమోహన్  మాట్లాడుతూ కోటి బీసీల సభ్యత్వాలను నిర్ణీత కాలంలో పూర్తిచేసి బీసీ లీడర్లకు శిక్షణ తరగతులను ఏర్పాటు చేయాలన్నారు. బీజేపీ బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్,  మాజీ ఎంబీసీ చైర్మన్  తాడూరి శ్రీనివాస్, జాతీయ బీసీ సంఘం కన్వీనర్  గుజ్జ కృష్ణ  తదితరులు పాల్గొన్నారు.