- స్వల్ప తేడాతో ఓడిపోయిన అభ్యర్థుల్లో తీవ్ర నిరాశ
- సమాన ఓట్లు వచ్చిన స్థానాల్లో డ్రా ద్వారా ఎంపిక
నెట్వర్క్, వెలుగు: ఒక్క ఓటే అభ్యర్థుల తలరాత మార్చింది. ఆ ఒక్క ఓటు కొందరిని సర్పంచ్ పీఠంపై కూర్చోబెడితే, అదే ఒక్క ఓటు పలువురిని పదవికి దూరం చేసింది. ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో అన్ని శక్తులు సమీకరించుకుని బరిలోకి దిగిన నేతలు ఒకే ఒక్క ఓటు తేడాతో ఓడిపోవడంతో విచారంలో మునిగిపోయారు. పలువురు ఆశ చావక రీకౌంటింగ్ చేయించినా ఫలితం దక్కకపోవడంతో తీవ్ర నిరాశ చెందారు. మరోవైపు మెజారిటీ రాకపోయినా పదవి అయితే దక్కిందని గెలిచిన వాళ్లు సంబరపడ్డారు.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం బాణాపూర్ సర్పంచ్ గా కాంగ్రెస్ బలపర్చిన అనిల్ కుమార్ ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. ప్రత్యర్థి రిక్వెస్ట్‌తో పోలింగ్ అధికారులు రెండుసార్లు రీకౌంటింగ్ నిర్వహించినా అనిల్ కు ఒక్క ఓటు ఆధిక్యం కొనసాగింది.
నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని రువ్వి గ్రామంలో మల్లేశ్‌యాదవ్ తన సమీప అభ్యర్థి గంగాధర్ యాదవ్ పై ఒక్క ఓటుతో గెలుపొందారు. గంగాధర్ కు182 ఓట్లు రాగా, మల్లేశ్‌యాదవ్ కు 183 ఓట్లు వచ్చాయి.
ఒక్క ఓటుతో ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం ముత్తునూరు తండాకు చెందిన జాదవ్ రాంజీ గెలిచారు. మొదట రెండు ఓట్లతో రాంజీ గెలిచినట్టు అధికారులు ప్రకటించగా అతని ప్రత్యర్థి ప్రకాశ్ రీకౌంటింగ్ చేయాలని డిమాండ్ చేశారు. రీకౌంటింగ్‌లో రాంజీకి 177 ఓట్లు రాగా, ప్రకాశ్ కు 176 ఓట్లు వచ్చాయి. దీంతో రాంజీ ఒక్క ఓటుతో గెలిచినట్టు ప్రకటించారు.
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం పాతర్లపల్లి గ్రామంలో బీజేపీ బలపర్చిన అభ్యర్థి బైరెడ్డి వెంకటరమణారెడ్డి కూడా ఒక్క ఓటుతో గెలిచారు. ఆయనకు 219 ఓట్లు రాగా, కాంగ్రెస్ బలపర్చిన చల్లూరు కృష్ణకు 218 ఓట్లు వచ్చాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఊలూరుపాడు మండలం అనంతారంలో కోర్సా రమేశ్ ఒక్క ఓటుతో గెలిచారు. రమేశ్‌కు 263, ఈసం శ్రావణికి 262 ఓట్లు వచ్చాయి. దీంతో రమేశ్ గెలిచినట్టు అధికారులు ప్రకటించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం నల్లబండబోడు పంచాయతీలో 144 ఓట్లకు గానూ 139 ఓట్లు పోల్ అయ్యాయి. గడిగ సింధుకు 70, ఝాన్సీ రాణికి 69 ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటుతో గడిగ సింధు విజయం సాధించినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి గ్రామ సర్పంచ్ గా బీఆర్ఎస్ బలపర్చిన ఉమ్మెంతుల శోభ ఒక్క ఓటుతో గెలుపొందారు. కాంగ్రెస్ బలపరిచిన పల్లె లక్ష్మీపై ఆమె విజయం సాధించారు. మొత్తం 429 ఓట్లు పోల్ కాగా, నాలుగు చెల్లలేదు. ఇందులో శోభకు 213 ఓట్లు రాగా, లక్ష్మికి 212 పోల్ అయ్యాయి.
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాజారాం గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా చెన్నెల్లి వెంకటి ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు.
డ్రా ద్వారా వరించిన అదృష్టం
నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని బెల్గాం తండాలో ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు రావడంతో అధికారులు లాటరీ తీశారు. ఇండిపెండెంట్ అభ్యర్థి జాదవ్ గోకుల్, బీజేపీ బలపర్చిన అభ్యర్థి రాథోడ్ అనిల్‌కు 192 చొప్పున ఓట్లు వచ్చాయి. రీ కౌంటింలోనూ సమాన ఓట్లు రావడంతో లక్కీ డ్రా నిర్వహించారు. ఇందులో గోకుల్ గెలిచారు.
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల సర్పంచ్ పదవి పర్ష కోటయ్యకు లాటరీ ద్వారా దక్కింది. ఇక్కడ నలుగురు అభ్యర్థులు బరిలో నిలవగా, రాపాక శ్రీనివాస్, పర్ష కోటయ్యలకు సమానంగా 155 ఓట్ల చొప్పున పోలయ్యాయి. దీంతో పోలింగ్ సిబ్బంది లాటరీ నిర్వహించారు. డ్రాలో కోటయ్యను విజాయం వరించింది.
వికారాబాద్ జిల్లా దోమ మండలంలోని పాలేపల్లిలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి జెలి లక్ష్మి, కాంగ్రెస్ బలపరిచిన సుజాతకు సమాన ఓట్లు వచ్చాయి. ఇద్దరికి 959 ఓట్లు పోల్ కావడంతో అధికారులు టాస్ వేసి సుజాతను విన్నర్‌గా ప్రకటించారు.
