- కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం
నస్పూర్, వెలుగు: జిల్లాలో వరి ధాన్యం, పత్తి పంటల కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో అడిషనల్కలెక్టర్ పి.చంద్రయ్యతో కలిసి జిల్లా పౌరసరఫరాలు, వ్యవసాయ, సహకార శాఖల అధికారులు, మార్కెట్ కమిటీ ప్రతినిధులు, మెప్మా అధికారులతో రివ్యూ నిర్వహించారు. జిల్లాలో పత్తి పంట దిగుబడి అంచనా వేయాలని, అందుకు అనుగుణంగా కొనుగోలు కోసం ఏర్పాట్లు చేయాలన్నారు. రైతులకు టోకెన్లు జారీ చేసి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ విస్తరణ అధికారులను ఆదేశించారు.
జిల్లాలో 2 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉందని, అందుకు అనేగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు. రైతుల వద్ద నుంచి నుంచి కొనుగోలు చేసిన తర్వాత సకాలంలో వారి ఖాతాల్లో నగదు జమ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్ శ్రీకళ, సహకార అధికారి, జిల్లా మార్కెటింగ్ అధికారి షహబుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.
