కొడుకు మృతి.. అబార్షన్ చేయించుకున్న కోడలు

కొడుకు మృతి.. అబార్షన్ చేయించుకున్న కోడలు
  • పరిగి హాస్పిటల్​ ఎదుట ఆందోళన

పరిగి, వెలుగు: ఓ వ్యక్తి కరెంట్​షాక్​తో చనిపోయాడు.. ఇంకా దశదిన కర్మ కూడా పూర్తి కాలేదు.. అతని భార్య గర్భిణి.. కవలలని డాక్టర్లు నిర్ధారించారు.. భర్త లేకుండా పిల్లల పోషణ ఎలా అనుకుందో ఏమో ఓ ప్రైవేట్​హాస్పిటల్​కు వెళ్లి, అబార్షన్​ చేయించుకుంది. బాధిత కుటుంబసభ్యులు ఆ దవాఖాన ఎదుట ఆందోళన చేపట్టారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండలం కొత్తపల్లికి చెందిన నందినికి ఏడాది కింద పరిగి మండలం కాలాపూర్ తాండాకు చెందిన విస్లావత్ హనుమంతుతో వివాహం జరిగింది. 

నెల క్రితం ఆమె గర్భం దాల్చడంతో దంపతులిద్దరూ పరిగిలోని విజేత హాస్పిటల్​కు వెళ్లారు. వైద్య పరీక్షల్లో గర్భంలో కవలలున్నారని నిర్ధారించారు. దీంతో దంపతులు సంతోషంగా ఇంటికి వెళ్లారు. తర్వాత హనుమంతు టిప్పర్ నడుపుతూ కరెంట్​ షాక్ కు గురై, చికిత్స పొందుతూ వారం క్రితం మృతి చెందాడు. మంగళవారం నందిని తన తల్లితో కలిసి విజేత హాస్పిటల్​కు వెళ్లి, అబార్షన్ చేయించుకుంది. విషయం తెలుసుకున్న హనుమంతు కుటుంబసభ్యులు బుధవారం ఆ దవాఖాన ఎదుట ఆందోళనకు దిగారు. అబార్షన్​ఎందుకు చేశారంటూ డాక్టర్లతో గొడవపడ్డారు.

 పోలీసులు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. వైద్యులు కారులో అక్కడినుంచి వెళ్లిపోతుంటే దాడికి యత్నించారు. హనుమంతు తండ్రికి అతనొక్కడే సంతానం. హనుమంతు భార్య అబార్షన్ చేయించుకోవడంతో తమకు వారసుడు లేకుండా పోయాడని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చట్టవిరుద్ధంగా అబార్షన్ చేసిన డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​చేశారు.