
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO), భారత వైమానిక దళం (IAF) సంయుక్తంగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 'అస్త్ర' క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు.ఒడిశా తీరంలో సుఖోయ్-30 Mk-I ఫైటర్ జెట్ నుంచి బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్-టు-ఎయిర్ మిస్సైల్ (BVRAAM) 'అస్త్ర' క్షిపణిని ప్రయోగించారు.రెండు క్షిపణులను అధిక వేగంతో కదిలే మానవరహిత వైమానిక లక్ష్యాలపై వివిధ దూరాలలో, వేర్వేరు కోణాలలో, లాంచ్ ప్లాట్‌ఫారమ్ పరిస్థితులలో ప్రయోగించారు.రెండు సందర్భాలలోనూ క్షిపణులు తమ లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేశాయి.
అస్త్ర క్షిపణి ప్రత్యేకతలు:
స్వదేశీ RF సీకర్: ఈ అస్త్ర క్షిపణిలో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడిన రేడియో ఫ్రీక్వెన్సీ (RF) సీకర్ ఉంటుంది. ఈ సీకర్ క్షిపణి లక్ష్యాన్ని ట్రాక్ చేయడానికి అత్యంత కీలకం. అస్త్ర క్షిపణి 100 కిలోమీటర్లకు పైగా పరిధిలో లక్ష్యాలను టార్గెట్ చేయగలదు. అత్యాధునిక గైడెన్స్ ,నావిగేషన్ వ్యవస్థతో ఇది పనిచేస్తుంది. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేయగలదు. అస్త్ర క్షిపణి మాక్ 4.5 వేగాన్ని చేరుకోగలదు.
భారత రక్షణ సాంకేతికతలో ఇది ఒక ప్రధాన మైలురాయిని చేరుకుంది. అస్త్ర క్షిపణి సక్సెస్ తో స్వదేశీ సీకర్‌తో కూడిన అస్త్ర ఆయుధ వ్యవస్థ కచ్చితత్వం, విశ్వసనీయ పనితీరును మరోసారి నిరూపించాయి. విదేశీ విడిభాగాలపై ఆధారపడటాన్ని తగ్గించి, దేశీయ రక్షణ ఉత్పత్తి వ్యవస్థల అభివృద్ధిలో ముందడుగు.
ఈ ఆయుధ వ్యవస్థను విజయవంతంగా రూపొందించడంలో DRDOలోని వివిధ ప్రయోగశాలలతో పాటు, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) తో సహా 50కి పైగా ప్రభుత్వ, ప్రైవేట్ పరిశ్రమలు పాలుపంచుకున్నాయి.
ఈ విజయం సాధించిన DRDO, IAF, ఇతర సంస్థలను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. ఈ పరీక్షా విజయం భారతదేశ వైమానిక యుద్ధ సామర్థ్యాలను గణనీయంగా పెంచుతుందని అన్నారు.