
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ 2025 విజయోత్సవ వేడుకలో జరిగిన విషాద తొక్కిసలాట మరోసారి వార్తల్లో నిలిచింది. బెంగళూరులో జరిగిన ఈ ఘటనలో 11 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. తొక్కిసలాటపై దర్యాప్తు చేస్తున్న జ్యుడీషియల్ కమిషన్.. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (KSCA), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పోలీసులను ఆర్సీబీ ఐపీఎల్ విజయోత్సవ వేడుకల సందర్భంగా 11 మంది ప్రాణాలను కోల్పోవడానికి దారితీసిన లోపాలకు బాధ్యత వహించాలని నివేదించింది. రిటైర్డ్ జస్టిస్ జాన్ మైఖేల్ డి'కున్హా నేతృత్వంలోని ఏకసభ్య ప్యానెల్ శుక్రవారం (జూలై 11) తన నివేదికను ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సమర్పించింది.
తొక్కిసలాట సమయంలో స్టేడియం లోపల కేవలం 79 మంది పోలీసులు మాత్రమే ఉన్నారు. 2.5 లక్షలకు పైగా ప్రజలు ఉన్న ప్రాంతంలో బయట ఎటువంటి భద్రత లేదు. సంఘటన స్థలంలో అంబులెన్స్‌లు కూడా లేవు. అంతేకాకుండా కీలక అధికారులు ప్రమాదం జరిగే సమయంలో వెంటనే స్పందించడంలో విఫలమయ్యారని విచారణలో తేలింది. జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సంఘటనా స్థలానికి సాయంత్రం 4 గంటలకు చేరుకున్నారు. అయితే పోలీసు కమిషనర్‌కు సాయంత్రం 5:30 గంటల వరకు అంటే తొక్కిసలాట జరిగిన రెండు గంటల తర్వాత కూడా ఈ సంఘటన గురించి సమాచారం అందలేదు.
ALSO READ : Pat Cummins: అప్పటివరకు వైట్ బాల్ సిరీస్ ఆడను.. క్రికెట్‌కు కమ్మిన్స్ షార్ట్ బ్రేక్
2025 ఐపీఎల్ విజేతగా ఆర్సీబీ నిలిచిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ తొలిసారి టైటిల్ గెలవడంతో ఆర్సీబీ యాజమాన్యం 2025, జూన్ 4న బెంగుళూర్లో విక్టరీ పరేడ్, చినస్వామి స్టేడియంలో ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించింది. విజయోత్సవ ర్యాలీకి అభిమానులు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్నాటక ప్రభుత్వం.. తొక్కిసలాటపై విచారణకు జ్యుడిషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.