
వీకెండ్ కారణంగా వరుస సెలవులు రావడం.. దానికి తోడు శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు, సందర్శకుల తాకిడి ఎక్కువైంది. దీంతో హైదరాబాద్, శ్రీశైలం రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలు చీమల బారులు తీరినట్లుగా రోడ్డుపై నిలిచిపోయాయి.
శనివారం (జులై 12) శ్రీశైలం వెళ్లే దారిలో దోమలపెంట నుంచి సున్నిపెంట వరకు 12 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. 3 గంటలకు పైగా వాహనాలన్నీ రోడ్లపై నిలిచిపోయాయి. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నల్లమల అడవి మార్గంలో రోడ్లపై కిలోమీటర్ల మేర వేల వాహనాలు నిలిచిపోవడంతో పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.
ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో గేట్లను ఎత్తడంతో డ్యాం సందర్శకులకు ఆకర్శనీయంగా కనువిందు చేస్తోంది. నల్లమల ప్రకృతి అందాలు, డ్యాంను చూడటంతో పాటు శ్రీశైల ఆలయ దర్శనం కోసం భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వేల వాహనాలు రోడ్లపైన బారులు తీరాయి. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు మరింత సమయం పట్టనుందని పోలీసులు తెలిపారు.
శ్రీశైలం ప్రాజెక్టు మూడు గేట్లు బంద్
శ్రీశైలం జలాశయానికి ఇన్ ఫ్లో తగ్గడంతో శనివారం (జులై 12) మూడు గేట్లను మూసేశారు అధికారులు. ప్రస్తుతం ఒక గేటు ద్వారా 4,497 క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్ కు చేరుతోంది. సుంకేసుల, జూరాల నుంచి 1,37,635 క్యూసెక్కుల ఇనో వస్తుంది. జూలై నెలలోని శ్రీశైలం జలాశయానికి వరద వచ్చి.. డ్యామ్ పూర్తి స్థాయిలో నిండింది.
►ALSO READ | టీటీడీ ఉద్యోగుల సమస్యలపై సీఎంకు నివేదిక ఇస్తాం: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి..
దీంతో ఈ నెల 8న ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యం డ్యామ్ అధికారులు గేట్లను తెరిచారు. డ్యామ్ గేట్లను తెరవడంతో శ్రీశైలానికి భక్తులు, పర్యాటకులు పోటెత్తారు. తాజాగా మూడు గేట్లను మూసి వేయగా.. సాయంత్రానికి వరద తగ్గితే.. మిగిలిన ఒక్క గేటును కూడా క్లోజ్ చేసే అవకాశం ఉంది.