
శనివారం ( జులై 12 ) శ్రీవారిని దర్శించుకున్నారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి ఆనం. ఇవాళ టీటీడీ, దేవాదాయ శాఖ మధ్య తొలి సమావేశం జరగనుందని.. అనేక శాఖల్లో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం, భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. పదవి విరమణ పొందిన ఉద్యోగులు, అర్చకులు, రవాణా విభాగం వరకు టీటీడీలో అనేక సమస్యలు ఉన్నాయని.. ఉద్యోగుల సమస్యలపై సీఎంకు నివేదిక ఇస్తామని అన్నారు. ఉద్యోగులకు న్యాయం చేకూరేలా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు ఆనం.
తిరుమలలో నుంచే ప్రక్షాళన చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని అన్నారు. భక్తులకు ఆధ్యాత్మిక భావం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేస్తున్నామని.. 161 ప్రధాన ఆలయాల్లో ప్రసాదాల క్వాలిటీ, దర్శనాల విధివిధానాలను మెరుగుపరిచామని.. ఆలయ ప్రాంగణాలలో దైవనామస్మరణ మినహా మరే కార్యక్రమం నిర్వహించరాదని సీఎం ఆదేశించారని అన్నారు.
దేవాదాయ శాఖ నుంచి కామన్ గుడ్ ఫండ్ నుంచి 200 ఆలయాలకు పునఃనిర్మాణానికి ఆదేశాలు ఇచ్చామని.. దుపదీప నైవేద్యాలు అందించేలా చర్యలు చేపట్టామని అన్నారు ఆనం.