ఉత్తమ కోడళ్లు : అత్తమ్మ పాడె మోశారు

ఉత్తమ కోడళ్లు : అత్తమ్మ పాడె మోశారు

మహారాష్ట్ర : అత్తలను నానా చిత్రహింసలు పెట్టడమే కాకా.. అనాదాశ్రమంలో వేసే కోడళ్లకు ఈ సంఘటన ఒక గుణపాఠం అవుతుంది. భర్త తల్లి బాగోగులు చూడటం తమ బాధ్యతగా చూసుకున్నారు ఆ కోడళ్లు. ఎంతలా అంటే తల్లి కంటే ఎక్కువగా అత్తమ్మను ప్రేమించారు. ఒకరు కాదు ఇద్దరు కాదు పోటీపడి మరీ చక్కగా చూసుకున్నారు ఆ నలుగురు కోడళ్లు. చివరకు అత్తమ్మ చావులోను తమ ఆత్మీయతను చాటుకున్నారు. ఇప్పటివరకు చరిత్రలో ఏ కోడలు చేయలేని విధంగా పాడె మోసి అంత్యక్రియలు చేశారు ఆ ఉత్తమ కోడళ్లు. ఈ సంఘటన మహారాష్ట్రలో జరగగా వారికి హ్యాట్సాఫ్ అంటున్నారు.

వివరాలు : బీడ్ జిల్లా మరాఠ్ నగర్ లోని కాశీనాథ్ నగర్ లో సుందర్ బాయి(83) ఏళ్ల ముసలవ్వ ప్రతి నెల కొడుకుల దగ్గర నివాసం ఉంటుంది. ఆమెకు నలుగురు కొడుకులు. అయితే ఆమె కొడుకుల కంటే ఎక్కువ ప్రేమగా కోడళ్లను చూసుకునేది. దీంతో ముసలవ్వకు అంతకన్న రెట్టింపు ప్రేమను కొడళ్లు ఇచ్చారు. అయితే సుందర్ బాయి ఇటీవల చనిపోయారు. అత్తమ్మ చనిపోయిందన్న విషయం తెలియగానే ఆమె మృతదేహాం దగ్గర గుండెలవిసేలా ఏడ్చారు కోడళ్లు.

అంతేకాదు..అంత్యక్రియలు పూర్తయ్యేవరకు సంప్రదాయాలు కట్టుబాట్లు పక్కనపెట్టి అత్తమ్మ పాడె మోశారు ఆ నలుగురు కోడళ్లు. అత్తమ్మ ఇక లేదన్న విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నామని తెలిపారు కోడళ్లు లతా నవనాథ్, ఉషా రాధాకిషన్, మనీషా జలీందర్, మీనా మచ్చీంద్ర. వీరు చేసిన ఈ మంచి పనికి స్థానికంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆస్తులు లాక్కుని అత్తమ్మలకు బుక్కెడు తిండి పెట్టడానికి నానా తిట్లు తిడుతున్న కోడళ్లుకు నిజంగానే ఈ సంఘటన గుణపాఠం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వీరికి ఉత్తమ కోడళ్లుగా అవార్డు ఇవ్వాలంటూ మరి కొందరు ట్వీట్స్ చేస్తున్నారు.