బాల్ తగిలి కుప్పకూలిన బౌలర్.. డేవిడ్ వార్నర్ ఔదార్యం

బాల్ తగిలి కుప్పకూలిన బౌలర్.. డేవిడ్ వార్నర్ ఔదార్యం

ఇండియా- ఆస్ట్రేలియా మ్యాచ్ కు ముందు సందర్భం ఇది. ఆస్ట్రేలియా ఆటగాళ్లను ఓ సంఘటన కలవరపరిచింది.  నెట్ ప్రాక్టీస్ చేస్తున్న టైమ్ లో డేవిడ్ వార్నర్ బలంగా షాట్ కొట్టడంతో.. బంతి నేరుగా వెళ్లి బౌలర్ తలకు తగిలింది. ఆ నెట్ బౌలర్ కుప్పకూలిపోయాడు. అతడిని స్ట్రెచర్ పై హాస్పిటల్ కు తీసుకెళ్లి ట్రీట్ మెంట్ ఇచ్చారు.

4 రోజులు గడిచిన తర్వాత..

ఆ బౌలర్ ఆస్ట్రేలియా టీమ్ తో కలిసి ఓవల్ గ్రౌండ్ లో ఫొటోలకు పోజులిచ్చాడు. అతడిని ఆస్ట్రేలియా టీమ్ ఎంతో గౌరవించింది. అతడికి కొన్ని కానుకలు కూడా ఇచ్చింది.

ఆ 23 ఏళ్ల యువ బౌలర్ పేరు జై కిషన్ ప్లాహా. మన భారతీయుడే. ఇంగ్లీష్ క్లబ్ తరఫున క్రికెట్ ఆడుతున్నాడు. ఫాస్ట్ బౌలింగ్ చేసే ఆల్ రౌండర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. వరల్డ్ కప్ లో భాగంగా.. ఆస్ట్రేలియా-ఇండియా మ్యాచ్ సందర్భంగా.. నెట్స్ లో ఆస్ట్రేలియా ఆటగాళ్లకు బౌలింగ్ చేశాడు. అలా వార్నర్ కొట్టిన బాల్… జై కిషన్ ప్లాహా తలకు తగిలింది. ఈ సంఘటనతో ఆస్ట్రేలియా ప్లేయర్లు అందరూ షాకయ్యారు.

డేవిడ్ వార్నర్, లాంగర్, మాక్స్ వెల్, స్మిత్…. హాస్పిటల్ లో జై కిషన్ ను కలిశారు. తొందరగా కోలుకోవాలని విష్ చేశారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక… తమను గ్రౌండ్ లో కలవాలని జై కిషన్ ను డేవిడ్ వార్నర్ కోరాడు. అలా.. శ్రీలంక-ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా ఓవల్ స్టేడియంలో జై కిషన్.. డేవిడ్ వార్నర్ ను కలుసుకున్నాడు.

ఆ సమయంలో.. జై కిషన్ ను.. టీమ్ కు పరిచయం చేశాడు డేవిడ్ వార్నర్. దెబ్బ తగిలించినందుకు క్షమాపణలు కోరాడు. అతడిని ఆప్యాయంగా హగ్ చేసుకున్నాడు. ఆటగాళ్లు అందరూ సంతకాలు చేసిన ఆస్ట్రేలియా జెర్సీని జై కిషన్ కు బహుమతిగా ఇచ్చారు. క్రికెట్ కు సంబంధించిన మెలకువలు చెప్పాడు. ఎప్పుడైనా తన సహాయం కావాలంటే అందిస్తానని చెప్పాడు.

ఆస్ట్రేలియా ఆటగాళ్ల అభిమానం పొందిన జై కిషన్ ను భారతీయ మీడియా పలకరించింది. “2014లో ఓ మ్యాచ్ లో బౌన్సర్ బాల్ తలకు తగలడంతో ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్ .. కుప్పకూలిపోయి చనిపోయాడు. అప్పటినుంచి  మైదానంలో ఎవరైనా గాయపడితే ఆస్ట్రేలియా ఆటగాళ్లు టెన్షన్ పడిపోతుండటం చూస్తున్నా. నా విషయంలోనూ అదే జరిగింది. అందుకే.. నా బాగోగులపై ఎక్కువగా దృష్టిపెట్టారు. మెరుగయ్యాక నన్ను ఓ ప్రత్యేకమైన వ్యక్తిగా గౌరవించారు” అని చెప్పాడు జై కిషన్.

యువ ఫాస్ట్ బౌలర్ అయిన జై కిషన్ కు 6 వారాల రెస్ట్ చెప్పారు డాక్టర్స్. దీంతో.. ప్రస్తుతం అతడు  నెట్స్ కు దూరంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు.