వాళ్లను వేటాడుతం: 170కి పెరిగిన మృతులు

వాళ్లను వేటాడుతం: 170కి పెరిగిన మృతులు
  • పేలుడును మరిచిపోలేం.. చేసినోళ్లను వదిలిపెట్టబోం
  • కాబూల్​ ఎయిర్​పోర్టులో దాడిపై అమెరికా ప్రెసిడెంట్​ బైడెన్​ హెచ్చరిక
  • ‘ఐఎస్​‑కె’పై వేట మొదలైంది దాడులకు ఆదేశించాం
  •  మీడియా సమావేశంలో భావోద్వేగ ప్రకటన
  •  దాడిచేసింది మేమే.. ఐఎస్‌‌‑కె
  • అమెరికన్లు, వాళ్లకు సాయం చేసేటోళ్లే టార్గెట్
  • సూసైడ్​ బాంబర్​ ఫొటో విడుదల చేసిన టెర్రర్ సంస్థ

     
    వాషింగ్టన్: ‘కాబూల్ లో అమెరికన్లపై దాడిని ఎన్నటికీ మరువలేం.. దాడికి పాల్పడ్డ వాళ్లను క్షమించలేం.. వారిని వెంటాడి, వేటాడి తగిన మూల్యం చెల్లించేలా చేస్తాం’ అని అమెరికా ప్రెసిడెంట్​ జో బైడెన్​ ప్రతిజ్ఞ చేశారు. అమెరికాకు హాని చేయాలని అనుకునే వాళ్లనూ వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు. అమెరికన్లను, అమెరికా ఆకాంక్షలను కాపాడేందుకు ఎంతవరకైనా వెళతామని బైడెన్​ వివరించారు. కాబూల్​ ఎయిర్​ పోర్టు దాడి వెనకున్నది ఐఎస్​కే టెర్రరిస్టులని, వారితో పాటు ఆ సంస్థపైన దాడులు చేయాలంటూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఐఎస్​కే నాయకులను వదిలిపెట్టేదిలేదని తేల్చి చెప్పారు. ఈ బాంబు దాడులకు బెదిరి అఫ్గానిస్తాన్​ నుంచి అమెరికన్ల తరలింపు మిషన్​ను ఆపబోమని స్పష్టం చేశారు. ఈ నెలాఖరులోగా అఫ్గాన్​లోని అమెరికన్లను స్వదేశానికి తీసుకొస్తామని బైడెన్​ తేల్చిచెప్పారు.
    13 మంది మృతి.. 18 మందికి గాయాలు
    కాబూల్​ ఎయిర్​ పోర్టు ముందు జరిగిన పేలుళ్లలో 13 మంది అమెరికన్​ సైనికులు చనిపోయారని బైడెన్​ చెప్పారు. మరో 18 మందికి గాయాలయ్యాయని వివరించారు. ఎయిర్​పోర్టు ముందు కాపలాగా ఉన్న సోల్జర్లపై ఐఎస్​ కే  టెర్రరిస్టు కాల్పులు జరిపాడని చెప్పారు. ఇలాంటి దాడులు జరిగే ప్రమాదం ఉందని అనుకుంటూనే ఉన్నామని, దాడులు జరపడమే వాళ్ల నైజమని మండిపడ్డారు. టెర్రరిస్టులు చేసే దాడులను తప్పించుకునేందుకు, వాటిని తిప్పికొట్టేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని బైడెన్​ వివరించారు. దాడులు జరిగినా అఫ్గానిస్తాన్ నుంచి అమెరికన్లను తరలించడం ఆపబోమని స్పష్టంచేశారు. అఫ్గాన్​ నుంచి బయటపడాలని నిర్ణయించుకున్న చివరి అమెరికన్​ను కూడా క్షేమంగా ఆ దేశం దాటిస్తామని తేల్చి చెప్పారు. ముందు ప్రకటించినట్లు ఈ నెలాఖరుకు అమెరికా బలగాల తరలింపు పూర్తిచేస్తామని బైడెన్​ చెప్పారు. టెర్రరిస్టుల దాడిలో కాబూల్​లో చనిపోయిన తమ బలగాలకు సంతాప సూచకంగా వైట్​హౌస్​తో పాటు దేశంలోని అన్ని ప్రభుత్వ ఆఫీసులపై జాతీయ జెండాలను అవనతం చేయాలని ప్రెసిడెంట్​ బైడెన్​ అధికారులను ఆదేశించారు.
    ఐఎస్​(కె) విస్తరించొద్దు
    అఫ్గానిస్తాన్​లో ఐఎస్(కె) ఇప్పుడున్న దానికి మించి ఏమాత్రం విస్తరించకుండా చూడాల్సిన అవసరం తాలిబాన్లకే ఉందని అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ అన్నారు. గురువారం వైట్​హౌస్​లో మీడియాతో మాట్లాడారు. కాబూల్ ఎయిర్ పోర్టు వద్ద పేలుళ్లకు ఐఎస్ దే బాధ్యత అని స్పష్టంచేశారు. ఐఎస్​తో తాలిబాన్లు కుమ్మక్కు కాలేదని భావిస్తున్నట్లు చెప్పారు. తాలిబాన్లు, ఐఎస్ టెర్రరిస్టుల మధ్య ఐడియాలజీ పరంగా స్పష్టమైన తేడాలు ఉన్నాయన్నారు. అయితే తాలిబాన్లు మంచి వాళ్లేమీ కాదన్నారు. ఇప్పుడు వాళ్లు ఎయిర్ పోర్టు నిర్వహణ కెపాసిటీ పెంచుకోవడం, ఎకానమీ కోలుకునేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ట్రంప్ హయాంలో కుదిరిన ఒప్పందం ప్రకారమే.. అమెరికా సేనలపై తాలిబాన్లు దాడులు చేయలేదన్నారు. అమెరికా బలగాలు వెనక్కి వెళ్లేదాకా తమ సోల్జర్లపై దాడులు చేయొద్దని ట్రంప్ ఒప్పందం కుదుర్చుకున్నారని బైడెన్ తెలిపారు.

 

లక్ష మంది దేశం దాటిన్రు..
కాబూల్ నుంచి సుమారు లక్ష మందిని వివిధ దేశాలకు తరలించినట్లు గురువారం అమెరికా అధికారులు వెల్లడించారు. ఇప్పటికీ వెయ్యి మంది అమెరికన్ లు, సోల్జర్లు ఉన్నట్లు తెలిపారు. దేశం దాటి పోయేందుకు వేలాది మంది అఫ్గన్లు ఎదురు చూస్తున్నారని చెప్పారు. గురువారం ఒక్క రోజే 5 వేల మంది దేశం దాటేందుకు లైన్ లో ఉన్నారని, శుక్రవారం మరింత మందిని తరలించే చాన్స్ ఉందన్నారు. అఫ్గాన్ నుంచి విదేశీ బలగాలు వెనక్కి వెళ్లేందుకు మంగళవారమే డెడ్ లైన్ కాగా, ఇప్పటికే పలు దేశాలు ఎవాక్యుయేషన్ ను ముగించాయి. బ్రిటన్ కు చివరిగా శుక్రవారం 8 విమానాలను నడుపుతామని ఆ దేశం స్పష్టం చేసింది. స్పెయిన్ ఇప్పటికే రెఫ్యూజీల తరలింపు ఆపేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ 31 నాటికి తమ బలగాలు వెనక్కి వెళతాయని, ఆ రోజుతో రెఫ్యూజీల తరలింపునూ ఆపేస్తామని అమెరికా కూడా స్పష్టం చేసింది. ఒకపక్క గడువు సమీపిస్తుండటం, మరోపక్క బాంబు దాడుల ముప్పు ఉండటంతో కాబూల్ ఎయిర్ పోర్టు వద్ద వేలాది మంది అఫ్గన్లు ఆందోళనతో గడుపుతున్నారు.  
టెర్రరిజానికి వ్యతిరేకంగా ఏకమవ్వాలె: ఇండియా 
కాబూల్ ఎయిర్ పోర్టు వద్ద సూసైడ్ బాంబర్ దాడులను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. గురువారం యూఎన్ లో మన దేశ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ టీఎస్ తిరుమూర్తి భద్రతా మండలిలో మాట్లాడారు. పేలుళ్లలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. టెర్రరిస్టులకు ఆశ్రయం కల్పించే దేశాలకు, టెర్రరిస్ట్ సంస్థలకు వ్యతిరేకంగా అన్ని దేశాలూ ఏకమవ్వాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి నొక్కి చెప్పిందని చెప్పారు. 

‘కిల్​ లిస్ట్’ అందించిన్రు..
తాలిబాన్లను నమ్మి అమెరికా ఇచ్చిన ఓ జాబితా ఇప్పుడు అఫ్గాన్ల ప్రాణాలను తీస్తోంది. ఆ లిస్టులోని వ్యక్తులను టార్గెట్​ చేసి తాలిబాన్లు దాడులకు తెగబడుతున్నారట. అఫ్గాన్​లో తమకు సాయంచేసిన లోకల్​ అఫ్గానీలనుఆదుకుంటామని అమెరికా గతంలోనే ప్రకటించింది. బలగాల తరలింపులో భాగంగా అధికారులు ఓ లిస్ట్​ తయారు చేశారు. అఫ్గాన్​లోని సైనికుల వివరాలు, గ్రీన్​ కార్డు హోల్డర్లతో పాటు సైన్యానికి సాయపడిన స్థానికుల వివరాలు ఇందులో పేర్కొన్నారు. ఈ లిస్ట్​లోని కొంతమంది అఫ్గన్లను కుటుంబాలతో సహా ఇప్పటికే తరలించింది. దేశం విడిచి వెళ్లేందుకు జనం పెద్ద సంఖ్యలో కాబూల్​ ఎయిర్​పోర్టుకు చేరుకోవడంతో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో తాలిబాన్లు జనాల ను అడ్డుకోవడం మొదలెట్టారు. ముఖ్యం గా అఫ్గాన్లను ఎయిర్​పోర్ట్​వైపు వెళ్లకుండా ఆపేశారు. దీంతో అమెరికా అధికారులు స్పందించి.. తమ దగ్గరున్న ఎవాక్యూషన్ లిస్టును తాలిబాన్లకు అందజేశారు. అందులో ఉన్నోళ్లను ఎయిర్​పోర్టుకు రాకుండా అడ్డుకోవద్దని చెప్పారు. తమకు సాయపడ్డ వాళ్లను క్షేమంగా తీసుకెళ్లే ఉద్దేశంతోనే అధికారులు ఆ లిస్టు అందించినా.. ఇప్పుడు అదే లిస్టు సదరు అఫ్గాన్లకు డెత్​ సెంటెన్స్ గా మారింది.