ప్రధాని మోడీని ఫాలో అయిన పాక్ పీఎం.. 24 గంటల్లోనే సేమ్ అదే పని చేసిన షబాజ్ షరీఫ్

ప్రధాని మోడీని ఫాలో అయిన పాక్ పీఎం.. 24 గంటల్లోనే సేమ్ అదే పని చేసిన షబాజ్ షరీఫ్

ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్‎తో కకావికలమైన పాక్.. భారత్‎పై దాడులు చేసి ప్రతీకారం తీర్చుకునేందుకు శతవిధాల ప్రయత్నించింది. భారత సైనిక స్థావరాలు, ఎయిర్ బేస్‎లే లక్ష్యంగా పాక్ డ్రోన్లు, మిసైల్ దాడులకు యత్నించింది. భారత ఆర్మీ పాక్ దాడులను ఎక్కడికక్కడ సమర్ధవంతంగా తిప్పకొట్టడంతో దాయాదిలా ఆటలు సాగలేదు. అయితే.. పాక్ మాత్రం పంజాబ్‌లోని అదంపూర్ వైమానిక స్థావరాన్ని ధ్వంసం చేశామని గొప్పులు చెప్పుకుంది. పాక్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చేందుకు స్వయంగా ప్రధాని మోడీనే రంగంలోకి దిగారు. 

పాక్ ఏదైతే ధ్వంసం చేశామని చెప్పుకుంటుందో అదే పాక్ సరిహద్దులోని అదంపూర్ ఎయిర్ బేస్‏ను మోడీ సందర్శించారు. సైనికులను కలిసి వారితో మాట్లాడి వారి ధైర్యసాహాసాలను కొనియాడారు. అనంతరం అదే అదంపూర్ ఎయిర్ బేస్‏ నుంచే పాక్‎కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. పాక్ పీఎం షబాజ్ షరీఫ్ భారత ప్రధాని మోడీని ఫాలో అయ్యారు. మోడీ మాదిరిగానే షబాజ్ షరీఫ్ కూడా స్వయంగా వెళ్లి పాక్ సైనికులను కలిశారు. 

బుధవారం (మే 14) సియాల్‌కోట్‌లోని పస్రూర్ కంటోన్మెంట్‌కు వెళ్లి భారత్‎తో జరిగిన ఘర్షణలో పాల్గొన్న అధికారులు, సైనికులను ఆయన కలిశారు. అనంతరం అధికారులు, సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూ, సమాఖ్య మంత్రులు అహ్సాన్ ఇక్బాల్, అత్తౌల్లా తరార్ తదితరులు షరీఫ్ తో ఈ పర్యటనలో పాల్గొన్నట్లు పాక్ ప్రధాని కార్యాలయం వెల్లడించింది. 

ప్రధాని మోడీ అదంపూర్ ఎయిర్ బేస్‏ను సందర్శించిన 24 గంటల్లోనే.. పాక్ ప్రధాని షబాజ్ షరీఫ్ కూడా స్వయంగా కంటోన్మెంట్‎కు వెళ్లి సైనికులను కలవడం చర్చనీయాంశంగా మారింది. సియాల్‌కోట్‌లోని పస్రూర్ కంటోన్మెంట్ పంజాబ్ ప్రావిన్స్ రాజధాని లాహోర్ నుండి దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆపరేషన్ సిందూర్‎లో భాగంగా భారత్ పస్రూర్, సియాల్‌కోట్ ఏవియేషన్ బేస్‌లోని రాడార్ సైట్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసి చేసి భారీ నష్టాన్ని కలిగించింది.