పద్మాదేవేందర్‌‌ రెడ్డిని ఇంటికి పంపాలి..డీసీసీ ప్రెసిడెంట్ తిరుపతిరెడ్డి

పద్మాదేవేందర్‌‌ రెడ్డిని ఇంటికి పంపాలి..డీసీసీ ప్రెసిడెంట్ తిరుపతిరెడ్డి

రామాయంపేట, వెలుగు: రామాయంపేట అభివృద్ధిని పట్టించుకోని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌‌ రెడ్డిని ఇంటికి పంపాలని డీసీసీ ప్రెసిడెంట్ కంఠారెడ్డి తిరుపతి రెడ్డి పిలుపునిచ్చారు. రెవెన్యూ డివిజన్ సాధన కోసం జేఏసీ అధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు బుధవారం 50 రోజులకు చేరిన సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందిరా గాంధీ విగ్రహం నుంచి మొదలైన ర్యాలీ మెదక్ చౌరస్తా వరకు సాగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో తిరుపతి రెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసేదాకా పోరాటం ఆపేది లేదని  రెడ్డి స్పష్టం చేశారు.  

ఇప్పటికే నియోజకవర్గం కోల్పోయి అభివృద్ధిలో వెనకబాటుకు గురైందని ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో డివిజన్ కోసం 186 రోజులు ఆందోళన చేయగా.. మంత్రి హరీశ్​రావు మాటిచ్చి తప్పారని మండిపడ్డారు. ఈ రోజు 5 వేల మందితో ర్యాలీ నిర్వహించామని, వచ్చే నెలలో 10 వేల మందితో మెదక్‌లో సీఎం కేసీఆర్‌‌ను అడ్డుకుంటామని హెచ్చరించారు. నేతలు రామచంద్రాగౌడ్ రమేశ్‌ రెడ్డి, చింతల యాదగిరి, జేఏసీ నాయకులు, పెద్ద ఎత్తున ప్రజలు  పాల్గొన్నారు.