- రిసెప్షన్‌కు వెళ్లి వస్తుండగా హనుమకొండ జిల్లాలో ప్రమాదం
భీమదేవరపల్లి, వెలుగు : రెసెప్షన్‌కు వెళ్లి వస్తూ రోడ్డు పక్కన ఆగి ఉన్న బొలెరోను డీసీఎంను ఢీకొట్టడంతో ముగ్గురు చనిపోగా మరో 28 మందికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని గోపాల్‌పూర్ క్రాస్ వద్ద గురువారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సుదన్‌పల్లి గ్రామానికి చెందిన ఉస్తం రాజు కూతురు నాగలక్ష్మికి, సిద్దిపేట జిల్లా పాలమాకుల మండలం దేవనవెంకటాపూర్ గ్రామానికి చెందిన భాస్కర్‌తో బుధవారం కురవి వీరభద్రస్వామి ఆలయంలో వివాహమైంది.
గురువారం రిసెప్షన్ ఉండడంతో సుదన్‌పల్లి నుంచి సుమారు 40 మంది బొలెరో వాహనంలో దేవన వెంకటాపూర్ వెళ్లారు. రిసెప్షన్ ముగిసిన తర్వాత నవదంపతులతో కలిసి తిరిగి సుదన్‌పల్లికి వస్తున్నారు. రాత్రి 11.50 గంటలకు భీమదేవరపల్లి మండలం గోపాలపూర్ క్రాస్ రోడ్డు వద్దకు చేరుకున్న వారు.. వాహనాన్ని రోడ్డు పక్కన ఆపారు. ఇదే టైంలో హుస్నాబాద్ వైపు నుంచి వేగంగా వచ్చిన డీసీఎం బొలెర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో ఉస్తం రాజు మేనకోడలు రెడ్డబోయిన స్వప్న (16) ఘటనా స్థలంలోనే చనిపోగా.. మిగతా వారంతా చెల్లాచెదురుగా పడిపోయారు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, ఇతర వాహనదారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ముల్కనూరు ఎస్సై రాజు, ఇతర సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఐదు అంబులెన్స్‌ల ద్వారా హాస్పిటల్‌కు తరలించారు. ఉస్తం రాజు అక్క కళమ్మ (55), మనువడు శ్రీనాథ్ (7) మార్గమధ్యలో చనిపోగా.. రాజు పరిస్థితి సీరియస్ ఉంది. అతడి బంధువులైన మరో 28 మంది స్వల్ప గాయాలతో వరంగల్ ఎంజీఎంలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. రాజు బంధువు శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ పులి రమేశ్ తెలిపారు.
