
ఎరుపు నుంచి కొత్త కలర్లోకి మార్చిన దూరదర్శన్
ట్విట్టర్లో ప్రమోషనల్ వీడియో.. ప్రతిపక్షాల విమర్శ
న్యూఢిల్లీ: ప్రభుత్వ ప్రసార సంస్థ దూరదర్శన్ వివాదంలో చిక్కుకున్నది. దాని ఇంగ్లీష్ న్యూస్ చానల్ అయిన డీడీ న్యూస్ లోగో రంగును మార్చడంపై ప్రతిపక్షాలనుంచి విమర్శలు ఎదురయ్యాయి. ఇదివరకు ఈ లోగో ఎరుపు రంగులో ఉండగా.. దాన్ని ఆరెంజ్ (కాషాయరంగు) కలర్లోకి మార్చారు. ఈ విషయాన్ని ఆ సంస్థ ప్రమోషన్ వీడియో రూపంలో ట్విట్టర్లో వెల్లడించింది. ‘ మా విలువలు అలాగే ఉన్నాయి. కానీ మేం ఇకనుంచి కొత్త అవతారంలో అందుబాటులో ఉంటాం. ఇంతకుముందెన్నడూ లేనివిధంగా న్యూస్ జర్నీకి సిద్ధం కండి. సరికొత్త డీడీ న్యూస్‌ను ఆదరించండి ’ అని పేర్కొన్నది.
ప్రసార భారతి కాదు.. ప్రచార భారతి..
డీడీ న్యూస్ కొత్త లోగోను ఎన్నికలముందే బీజేపీ జెండా రంగైన కాషాయంలోకి మార్చడంపై ప్రతిపక్షాలనుంచి విమర్శలు వెల్లువెత్తాయి. తృణమూల్ ఎంపీ, దూరదర్శన్ మాజీ సీఈవో జవహర్ సిర్కర్ డీడీ న్యూస్ లోగోమార్పును తప్పుబట్టారు. కలర్ మార్పుతో ఇక అది ప్రసార భారతి కాదు.. ప్రచార భారతిగా మారుతున్నదనే భావన కలుగుతున్నదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఓ పార్టీ రంగును ప్రతిబింబించేలా లోగోను మార్చడం ఎలక్షన్ కోడ్‌ను ఉల్లంఘించడమేనని అన్నారు. కాగా, లోగో మార్పుపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా మండిపడింది.
స్వయంప్రతిపత్తి కలిగిన ప్రభుత్వ సంస్థలను నియంత్రణ చేసేందుకు బీజేపీ చేస్తున్న కుట్ర ఇదని ఆరోపించింది. జాతీయ ప్రసార సంస్థ విశ్వసనీయతను దెబ్బతీస్తున్నారని మండిపడింది. ఇదిలా ఉండగా, లోగో కలర్ మార్పును ప్రసార భారతి సీవో గౌరవ్ ద్వివేది సమర్థించారు. చానల్ బ్రాండింగ్, దృశ్య సౌందర్యాన్ని పెంచేందుకే లోగో కలర్‌ను మార్చామని చెప్పారు. లోగోనే కాదు.. చానల్‌ను కూడా అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు చెప్పారు. చానల్ లోగో కలర్ మార్పుపై విమర్శలు చేయడం దురదృష్టకరమని అన్నారు.