ODI World Cup 2023: పంత్ రీ ఎంట్రీపై DDCA డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు

ODI World Cup 2023: పంత్ రీ ఎంట్రీపై DDCA డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు

టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్‌ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి అందరికీ విదితమే. ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్.. ఇప్పుడిప్పుడే ఆ గాయాల నుంచి కోలుకుంటున్నాడు. జట్టులోకి తిరిగి రావడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్ సీఏ)లో పునరావాసం పొందుతున్న పంత్.. ఎప్పటికప్పుడు తన ఆరోగ్యం గురుంచి, ఫిట్‌నెస్ గురించి అభిమానులకు తెలియజేస్తూనే ఉన్నాడు.

రిషబ్ పంత్ ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి డీడీసీఏ పెద్దలు నేడు(శనివారం) నేషనల్ క్రికెట్ అకాడమీని సందర్శించారు. అతని ఆరోగ్యం గురుంచి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన డీడీసీఏ డైరెక్టర్ శ్యామ్ శర్మ.. పంత్ మునుపటితో పోలిస్తే వేగంగా కోలుకుంటున్నారని, వీలైనంత త్వరగా జట్టులో చేరతారని వెల్లడించారు. అయితే, ప్రపంచకప్‌ నాటికి పంత్ కోలుకోవడం కష్టమే అన్నట్లు ఆయన మాట్లాడటం అభిమానులను కలవర పెడుతోంది.

"పంత్ వేగంగా కోలుకుంటున్నారు. ఫిట్‌నెస్ పరంగానూ బాగానే రాణిస్తున్నారు. అయితే అతను తిరిగి ఎప్పుడు జట్టులో చేరతాడన్నది చెప్పడం కాస్త కష్టమే. సమయం పట్టొచ్చు. ప్రపంచ కప్ నాటికి ఫిట్‌నెస్ సాధిస్తే జట్టులో చూడొచ్చు.." అని శ్యామ్ శర్మ తెలిపారు.

ఈ విషయమై బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ.."రిషబ్‌ పంత్ ఆశించిన దానికంటే వేగంగా కోలుకుంటున్నారు. కానీ తిరిగి జట్టులో ఎప్పుడు చేరతాడన్నది చెప్పడం చాలా కష్టం. ప్రాక్టీస్‌కు తిరిగొచ్చాక 3 నెలలు పట్టొచ్చు లేదా 6 నెలల కంటే ఎక్కువ సమయం పట్టొచ్చు. ఖచ్చితంగా చెప్పలేం.." అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ వ్యాఖ్యలను బట్టి పంత్.. వరల్డ్ కప్ 2023 జట్టులో ఉండటమన్నది కాస్త అనుమానమే అని చెప్పొచ్చు.