ప్రాజెక్టుల్లో నీళ్లు డెడ్ స్టోరేజీకి .. కృష్ణా, గోదావరి బేసిన్లలో పడిపోతున్న వాటర్ లెవెల్స్

ప్రాజెక్టుల్లో నీళ్లు డెడ్  స్టోరేజీకి ..  కృష్ణా, గోదావరి బేసిన్లలో పడిపోతున్న వాటర్  లెవెల్స్

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు చాలా వేగంగా పడిపోతున్నాయి. నాలుగు నెలల్లోనే ప్రాజెక్టుల్లో నీళ్లు డెడ్​ స్టోరేజీ లెవెల్స్​కు పడిపోయాయి. నిరుడు డిసెంబర్​తో పోలిస్తే ఈ నాలుగు నెలల్లోనే భారీగా తగ్గిపోయాయి. 2022 డిసెంబర్​1 నాటికి ప్రాజెక్టుల్లో ఉన్న జలాలతో పోలిస్తే 2023 డిసెంబర్​1 నాటికి ప్రాజెక్టులలో ఉన్న నీళ్లు సగమే. కేసీఆర్​  హయాంలోనే వర్షాలు సరిగ్గా పడక ప్రాజెక్టుల్లోకి వరద రాలేదు. దాని ప్రభావం ఇప్పుడు ప్రాజెక్టులపై తీవ్రంగా పడుతోంది. దీంతో ఉన్న జలాల్లో నుంచే సాగు, తాగునీటి అవసరాల కోసం వాడుకుంటుండడంతో ప్రాజెక్టుల్లో నీళ్లు తగ్గిపోయాయి. మరోవైపు ఎండలు కూడా తీవ్రం కావడంతో నీటి మట్టాలు దారుణంగా పడిపోతున్నాయి. ప్రస్తుతం కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు నిరాశాజనకంగా ఉన్నాయి. నిరుడు డిసెంబర్​ నుంచి ఏప్రిల్​ తొలి వారం వరకు నీటి మట్టాలు సగానికి సగం పడిపోయాయి. 

ఏ ప్రాజెక్టు చూసినా ఇదే పరిస్థితి.  ఇటీవల మిడ్​ మానేరు డ్యామ్​లో నీళ్లు లేకపోవడంతో ముంపు గ్రామం బయటపడిన సంగతి తెలిసిందే. 2022తో పోలిస్తే 2023లో ప్రాజెక్టుల్లో నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఆ ఏడాదితో పోలిస్తే 2023 డిసెంబర్​1నాటికి 50 శాతం తక్కువ జలాలు ప్రాజెక్టుల్లో నిల్వ ఉన్నాయి. ముఖ్యంగా కృష్ణా ప్రాజెక్టుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. శ్రీశైలంలో 2022 డిసెంబర్​ 1 నాటికి 137.59 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉంటే.. నిరుడు డిసెంబర్​ 1 నాటికి కేసీఆర్​ హయాంలో 59.75 టీఎంసీల నీళ్లే ఉన్నాయి. సాగర్​ ప్రాజెక్టులో 2022లో 303.43 టీఎంసీల నీళ్లు ఉంటే.. 2023లో 156.67 టీఎంసీల జలాలున్నాయి. అంటే కేసీఆర్​ సీఎంగా, బీఆర్ఎస్​ అధికారంలో ఉన్నప్పటికే రాష్ట్రంలో కరువు మొదలైంది. పంటలకు నీళ్లిచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. కాంగ్రెస్​ తెచ్చిన కరువు అని బీఆర్ఎస్​ నేతలు అదేపనిగా విమర్శిస్తున్నా.. అసలు పరిస్థితి మాత్రం కేసీఆర్​ హయాంలోనే కరువు మొదలైందని తెలుస్తోంది.

నాలుగు నెలల్లో మరింత కిందికి

కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పాటయ్యాక పంటల కోసం శక్తివంచన లేకుండా నీళ్లు విడుదల చేస్తున్నది. తాగునీటికి ఇబ్బందులు ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నది. ఎండలు తీవ్రంగా ఉండడంతో రిజర్వాయర్లలో జలమట్టాలు వేగంగా పడిపోయాయి. ఎన్నడూలేనిది మార్చి, ఏప్రిల్​ నెలల్లోనే టెంపరేచర్లు 42 నుంచి 45 డిగ్రీల మధ్యన నమోదవుతుండడంతో ప్రాజెక్టుల్లోని నీటి మట్టాలపై ప్రభావం పడుతున్నది. డిసెంబర్​ నుంచి ఏప్రిల్​ మధ్య కాలంలో నాలుగు నెలల్లోనే ప్రాజెక్టుల్లో జలాలు చాలా వరకు పడిపోయాయి. గోదావరి బేసిన్​లోని ప్రాజెక్టుల్లో 90 శాతం వరకు మట్టాలు పడిపోయాయి. శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్టులో నిరుడు డిసెంబర్​1 నాటికి 79.30 టీఎంసీల నీళ్లు ఉండగా.. ఏప్రిల్ 5 నాటికి 12.64 టీఎంసీలకు పడిపోయాయి. ఎల్లంపల్లిలో 16.16 టీఎంసీల నుంచి 7.59 టీఎంసీలకు తగ్గాయి. మిడ్​మానేరులో 23.44 టీఎంసీల నీళ్లుంటే.. ఇప్పుడు 7.59 టీఎంసీలకు పడిపోయాయి.