- పీక్స్‌కు చేరిన బైఎలక్షన్ క్యాంపెయినింగ్
- నవంబర్ 9తో ముగియనున్న ప్రచారం
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం పీక్స్‌కు చేరింది. ప్రచారం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర కీలక నాయకులు, వేలాది మంది కార్యకర్తలు నియోజకవర్గంలో మకాం వేశారు. ఒక అంచనా ప్రకారం.. మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నుంచి దాదాపు 20 వేల మందికి పైగా నేతలు, కార్యకర్తలు క్షేత్రస్థాయి ప్రచారంలో నిమగ్నమయ్యారు.
అధికార కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లందరినీ బూత్‌ల వారీగా, డివిజన్లవారీగా ఓటర్లకు మ్యాపింగ్ చేసుకుని ప్రచారాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నది. అంటే ప్రతి నిర్ణీత సంఖ్యలో ఉన్న ఓటర్లకు ఒక కీలక నాయకుడు బాధ్యత వహించేలా ప్రణాళిక రచిం చారు. బీఆర్ఎస్ పార్టీ కూడా అదే స్థాయిలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సంస్థాగత క్యాడర్‌ను భారీగా మోహరించి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నది. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హాట్ టాపిక్‌గా మారింది.
ఎక్కడ చూసినా ప్రచార హోరు..
జూబ్లీహిల్స్ నియోజకవర్గం రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలతో నిండిపోయింది. సభలు, ర్యాలీలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్, పోస్టర్లు, బ్యానర్లతో ఎక్కడ చూసినా పొలిటికల్ హంగామా కనిపిస్తున్నది. ప్రధాన రోడ్ల నుంచి గల్లీల వరకు ప్రచార వాహనాలు, బృందాల సందడి కొనసాగుతోంది. ప్రతి పార్టీకి చెందిన ప్యాండిల్స్, టెంట్లు, కంట్రోల్ రూములు ఆపరేషన్ మోడ్‌లో ఉన్నాయి. ప్రతి గల్లీలో వాచ్‌లిస్టులు, ఓటర్ డేటా, ఫాలోఅప్ టీమ్‌లు పని చేస్తున్నాయి.
సామాజిక వర్గాల వారీగా లీడర్లు.. ఆయా వర్గాల ఓటర్లను కలుస్తున్నారు. అధికార కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం వరకు ప్రతి పార్టీ తమ బలగాన్ని నియోజకవర్గంలో దింపాయి. కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం సంపూర్ణంగా బరిలోకి దిగింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, డివిజన్ స్థాయి ఇన్‌చార్జ్‌లు, గ్రామస్థాయి లీడర్లు అందరూ క్షేత్రస్థాయిలో బూత్‌ల వారీగా పని చేస్తున్నారు. ఒక్కో లీడర్‌కు ఇంతమంది అని ఓటర్లను మ్యాపింగ్ చేసి, వారికి చేరేలా వ్యూహాత్మక ప్రచారం సాగిస్తున్నారు. బీఆర్‌ఎస్ కూడా అదే తీరులో తమ సీనియర్ నేతలను రంగంలోకి దించింది.
ప్రతి డివిజన్‌కి బాధ్యతలు కేటాయించి, ఇంటింటికీ చేరుకునేలా పని చేస్తోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల నుంచే 80 శాతం మంది ప్రచారంలో పాల్గొంటున్నారు. ‘‘ప్రతి డివిజన్‌లో, ప్రతి బూత్‌లో ఓట్లు ఇన్ని పడాలి.. టార్గెట్ ఇది’’ అంటూ అందుకు అనుగుణంగా ప్రతి లీడర్‌కి ప్రత్యేక బూత్‌లు కేటాయించారు. వీరి ఆధ్వర్యంలో వందలాది మంది గ్రామ, మండల స్థాయి కార్యకర్తలు వచ్చి మకాం వేసి పని చేస్తున్నారు. ఒక్కో లీడర్ కింద 300 నుంచి 400 మంది వరకు ఫీల్డ్ సిబ్బంది పని చేస్తున్నారు.
ఆరోపణలు.. ప్రత్యారోపణలు..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇటు అధికార కాంగ్రెస్ కు, అటు ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది. దీంతో నాయకుల మధ్య మాటల తూటా లు పేలుతున్నాయి. కాంగ్రెస్ నాయకులు తమ ప్రభుత్వ ఆరు గ్యారంటీలు, అభివృద్ధి పనులపై ప్రచారం చేస్తూనే.. గత బీఆర్ఎస్ పాలనలోని లోపాలను ఎత్తిచూపుతున్నారు. ఇక బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పిస్తూ.. గత పదేండ్లలో
రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశామని ప్రచారం చేస్తున్నారు.
సంపన్న వర్గాల నుంచి అత్యంత పేద వర్గాల వరకు ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో రెండు పార్టీల నేతలు ప్రతి ఇంటికి వెళ్తూ, ఓటర్లను వ్యక్తిగతంగా కలుస్తున్నారు. రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష నేతలందరూ ఈ ఒక్క నియోజకవర్గంలోనే కేంద్రీకృతం కావడంతో గెలుపుపై ఇరుపక్షాలు ఎంతటి పట్టుదలతో ఉన్నాయో స్పష్టం చేస్తున్నది. ఇక ఈ నెల 9తో ప్రచార గడువు ముగియనుండడంతో రెండు పార్టీలు మరింత వేగం పెంచాయి.
